Talking on Phone While Driving: ఎవరైనా ఫోన్‌లో మాట్లాడుతూ కారు నడిపితే మీకు ట్రాఫిక్ రూల్స్ తెలియవా.. అసలు మీకు సెన్స్ ఉందా అనే మాటలు త్వరలో వినిపించవు. ఎందుకంటే ఫోన్‌లో మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదని, త్వరలో దీన్ని చట్టబద్ధం చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. అయితే అందుకు కొన్ని షరతులు వర్తిస్తాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యానించారు. ఫోన్ హ్యాండ్స్-ఫ్రీ పరికరానికి కనెక్ట్ చేసి మాత్రమే డ్రైవింగ్ చేసేవారికి మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు.


ఫోన్‌లో మాట్లాడుతూ కారు నడుపుతున్న సమయంలో మీ మొబైల్ వాహనంలో ఉండకూడదని, కేవలం మీ పాకెట్‌లో ఉండాలి. బ్లూ టూత్, ఇయర్ ఫోన్స్ లాంటి పరికరాలు ఉపయోగించి వాహనం నడపుతున్న వ్యక్తి ఫోన్‌లో మాట్లాడే వెసలుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక నిబంధనలు తీసుకొస్తామని చెప్పారు. బ్లూ టూత్, ఇయర్ ఫోన్ ద్వారా ఫోన్లో మాట్లాడూ డ్రైవింగ్ చేస్తున్న వారికి ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు వేయకూడదని సూచించారు. ఎవరైనా జరిమానా విధిస్తే కోర్టుకు వెళ్లి సవాల్ చేసుకునే అవకాశాన్ని వాహనదారులకు కల్పిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.


వారికి చలానా తప్పదు..
త్వరలో తాము తీసుకొచ్చే రూల్స్ దుర్వినియోగం అవకూడదని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వ్యక్తి మొబైల్‌ను హ్యాండ్స్-ఫ్రీ డివైస్‌కు క‌నెక్టు చేయ‌కుండా ఫోన్‌లో మాట్లాడుతున్నట్లయితే చలానా వేస్తారని హెచ్చరించారు. వచ్చే మూడేళ్లలో దేశంలో రోడ్డు ప్రమాదాలను 50 శాతం మేర తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్నామని, ప్రపంచ దేశాలకు సైతం దీన్ని ఎగుమతి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని వాహనాలకు రేటింగ్స్ సైతం ఇస్తామన్నారు.


హ్యాండ్స్ ఫ్రీ డివైస్ వాడుతూ వాహనాలు నడపటం చట్టవిరుద్ధమని భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. వాహనాలు నడుపుతున్న సమయంలో ఇయర్ ఫోన్స్ వాడి మ్యూజిక్ వినడం, ఇతరులతో ఫోన్ మాట్లాడటం లాంటివి చట్ట విరుద్ధమని పలు రాష్ట్రాల ట్రాఫిక్ విభాగం పోలీసులు చెబుతున్నారు. వీటి వల్ల ట్రాఫిక్ నియంత్రణ సమస్యలు తలెత్తడంతో పాటు రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని కొందరు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


Also Read: Gateway IT Park: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ ప్రాజెక్ట్, సిటీకి మరోవైపు, ఏకంగా 50వేల ఉద్యోగాలు,


Also Read: PM Modi: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతాలోపం, అంబులైన్స్ లో వైద్యులు మిస్సింగ్!