Sweeper Bank Notice: సాధారణ జీవనం గడిపే ఓ స్వీపర్ కు బ్యాంకు భారీ షాక్ ఇచ్చింది. వెయ్యి, రెండు వేలు కాదు ఏకంగా రూ. 16 కోట్ల రుణం చెల్లించాలని నోటీసులు పంపింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. ఆ నోటీసులు అందుకున్న వ్యక్తికి ఆ బ్యాంకులో కనీసం అకౌంట్ కూడా లేకపోవడం. అదేంటి అనుకుంటున్నారా.. బ్యాంక్ సిబ్బంది తప్పిదం అలా ఉంటుంది మరి. రూ.16 కోట్ల రుణం చెల్లించాలని పంపిన ఆ నోటీసుతో ఆ స్వీపర్ కుటుంబం అవాక్కయింది. అతని భార్య భయంతో అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
16 కోట్లను తిరిగి చెల్లించాలని నోటీసులు
గుజరాత్ రాష్ట్రం వడోదర నగరానికి చెందిన శాంతిలాల్ అనే వ్యక్తి తన భార్య జాషిబెన్ తో కలిసి రాజ్యలక్ష్మి సొసైటీలో నివాసం ఉంటున్నాడు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాంతిలాల్ కు ఈ నోటీసు పంపింది. రూ. 16 కోట్లను మార్చి 4వ తేదీ లోపు తిరిగి చెల్లించాలని నోటీసులు పంపించారు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు. లోన్ చెల్లించకపోతే చట్టప్రకారం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొన్నారు అధికారులు. బ్యాంకు నోటీసులు అందుకున్న శాంతిలాల్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. శాంతిలాల్ భార్య జాషిబెన్ అయితే సొమ్మసిల్లి పడిపోయింది. అనారోగ్యానికి గురైన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
నోటీసులు ఎందుకు వచ్చాయో కూడా వారికి తెలీదు..!
బ్యాంకు నుండి తమకు అందిన నోటీసు గురించి తెలుసుకునేందుకు శాంతిలాల్ కుటుంబం వడోదర నగర కార్యాలయానికి వెళ్లారు. వారికి ఎందుకలా నోటీసులు వచ్చాయోనని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ అధికారులు ఏ విషయాన్నీ సరిగ్గా చెప్పలేదు. వారికి ఎందుకు నోటీసులు పంపించిన విషయాన్ని వారికి చెప్పకుండా వారిపై కసురుకున్నారు. అసలు వారికెందుకు నోటీసులు వచ్చాయోనన్న విషయం శాంతిలాల్ కుటుంబానికి సరిగ్గా తెలీదు. అసలు ఎందుకు వచ్చాయో తెలుసుకునేందుకు పలువురు బ్యాంక్ అధికారులను కలిశారు. చివరకు చేసేదేం లేక శాంతిలాల్ స్థానిక ఎమ్మెల్యే నీరజ్ చోప్రాను ఆశ్రయించాడు. ఎమ్మెల్యే నీరజ్ చోప్రా బాధితుల తరఫున జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందించి మరీ వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.
వారి ఆస్తులే 5 నుంచి 10 లక్షలు ఉంటాయిని ఎమ్మెల్యే
శాంతిలాల్ స్వీపర్ గా పని చేస్తున్నాడని, వారి మొత్తం ఆస్తులే రూ. 5 నుండి రూ. 10 లక్షలు ఉంటుందని ఎమ్మెల్యే నీరజ్ చోప్రా అన్నారు. అలాంటి వారు రూ. 16 కోట్లు ఎలా అప్పు చేశారని బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. ఇదొక తప్పుడు నోటీసని అన్నారు. దీని వల్ల శాంతిలాల్ కుటుంబం ఆస్పత్రి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసుపై విచారణ జరిపించాలని అధికారులను ఎమ్మెల్యే నీరజ్ చోప్రా డిమాండ్ చేశారు. ఎలాగైనా సరే వారికి త్వరగా న్యాయం చేస్తే బాగుంటుందని వివరించారు.