Monkeypox Death in India: దేశంలో తొలి మంకీపాక్స్ అనుమానిత మరణం నమోదు అయింది. కేరళలోలని త్రిస్సూర్ జిల్లాలో శనివారం 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మృతుడు జులై 21వ తేదీన యూఏఈ నుంచి వచ్చినట్లు తెలిపారు. అయితే ఆ యువకుడికి యూఏఈలోనే మంకీపాక్స్ పాజిటివ్ తేలిందని వివరించారు. భారత్ కు వచ్చిన తర్వాత వైరస్ నిర్ధారణ కోసం యువకుడి నమూనాలను అలప్పుళలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రాంతీయ కేంద్రానికి పంపినట్లు అధఇకారులు తెలిపారు 


స్నేహితులతో కలిసి రోజంతా...


యువకుడు వచ్చిన నాటి నుంచి తిరిగిన ప్రదేశాల గురించి వివరాలు సేకరించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. వైరాలజీ ల్యాబ్ ఇచ్చే ఫలితం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఒఖవేళ పాజిటివ్ గా నిర్ధరణ అయితే నమూనాలోను పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్ కు పంపిస్తామని పేర్కొన్నారు. యువకుడితో కాంటాక్ట్లో ఉన్న వారందరూ ఆసోలేషన్ కావాలని కోరారు. అయితే జులై 21వ తేదీన వచ్చిన అతడు... 22వ తేదీన స్నేహితులతో కలిసి ఫుట్ బాల్ ఆడినట్లు తెలుస్తోంది. 


జ్వరం రావడంతోనే ఆస్పత్రిలో చేరిన అబ్బాయి...


జులై 26వ తేదీ జ్వరం రావడం వల్ల ఆస్పత్రిలో చేరాడు. మంకీపాక్స్ లక్షణాలుగా నిర్ధారించడం వల్ల, మరో ఆస్పత్రికి తరలించారు. దీంతో యువకుడు స్నేహితులు ఐసోలేషన్ లోకి వెళ్లారు. అతని శరీరంపై మంకీపాక్స్ లక్షణాలు లేకపోవడంతో ఈ దిశగా చికిత్స అందించలేదు. అయితే శనివారం ఆ యువకుడు మృతి చెందాడు. అనంతరం అతడికి యూఏఈలోనే జులై 19న మంకీపాక్స్ సోకిన విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు అధికారులకు వెల్లడించారు. యూఏఈ నుంచి భారత్ కు బయలు దేరి ముందు వచ్చిన మంకీపాక్స్ పరీక్ష ఫలితాన్ని వైద్యులకు అందించారు. 


ఆరోగ్యంగానే ఉండి మృతి చెందడంపై అనుమానాలు..


యువకుడి మరణానికి సంబంధించిన కారణాలను గురించి ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడని... ఎలాంటి సమస్యలు లేవని మృతికి గల కారణాలు ఏంటో పరిశీలిస్తామని చెప్పారు. మంకీపాక్స్ కరోనాలా కాదని, వ్యాపించినా మరణాలు రేటు తక్కువగా ఉంటుందని వివరించారు కాబట్టి ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు, కాకపోతే మంకీపాక్స్ వ్యాపించకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ మంకీపాక్స్ పై సరైన పరిశోధనలు జరగలేదని అన్నారు. 
భారతదేశంలో ఇప్పటి వరు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. మొదటి కేసు నమోదైన రోగి శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అలాగే మంకీపాక్స్ తో స్పెయిన్ లో శనివారం రెండో మరణం నమోదు అయింది. ఈ మధ్య కాలంలో వ్యాపించిన మంకీపాక్స్.. పాజిటివ్ గా తేలి మరణించిన తొలి వ్యక్తి ఇతడే.