Gyanvapi ASI survey:
ASI సర్వే
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ASI సర్వే ఆపేయాలని మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అలహాబాద్ హైకోర్టు సర్వేకి అనుమతినిస్తూ తీర్పునివ్వడాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ పిటిషన్ వేసింది. ఈ కమిటీ తరపున అడ్వకేట్ హుజేఫా అహ్మదీ వాదించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సర్వే జరుగుతున్న దశలో జోక్యం చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది.
"ఇప్పటికే ఈ విషయంలో స్పష్టమైన తీర్పు వచ్చేసింది. ఈ దశలో ఎందుకు జోక్యం చేసుకోవాలి..? మసీదులో తవ్వకాలపై ఇప్పటికే చర్చ జరిగింది. దానిపై ASI టీమ్ స్పష్టంగా సమాధానమిచ్చింది. తవ్వకాలు జరపకుండానే సర్వే చేపడతామని చెప్పింది. మేం కూడా అదే సూచించాం. ఈ సర్వే పూర్తైన తరవాత ఆర్కియాలజీ అధికారులు ఓ రిపోర్ట్ ఇస్తారు"
- సుప్రీంకోర్టు
అంతకు ముందు అడిషనల్ సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ తన వాదన వినిపించారు. మసీదులో కొన్ని గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అవేంటో తెలుసుకోవాల్సిన అవసరముందని అన్నారు.
"మసీదులో ఆలయానికి సంబంధించిన కొన్ని గుర్తులున్నాయి. వాటిని సైంటిఫిక్‌గా స్టడీ చేసిన తరవాతే నిర్ధరించుకోగలం. ఈ సర్వే చేసే క్రమంలో మేం పారదర్శకత పాటిస్తాం. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే లైవ్ స్ట్రీమింగ్ చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం"
- మాధవి దివాన్, అడిషనల్ సొలిసిటర్ జనరల్
మరోవైపు వారణాసి కోర్టులోనే మరో పిటిషన్‌పై విచారణ జరిగింది. మసీదులో త్రిశూలం, స్వస్తిక్ గుర్తులు కనిపించాయని పిటిషన్ దాఖలైంది. ఆ గుర్తులను చెరిపేయకుండా కాపాడాలని పిటిషన్‌లో కోరారు.