Supreme Court: సుప్రీంకోర్టు కొలిజీయం కీలనిర్ణయం తీసుకుంది. దేశంలోని మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని కొలీజియం ముగ్గురు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, రాజస్థాన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అగస్తిన్‌ జార్జ్ మాసిహ్‌, గౌహతి సీజే జస్టిస్‌ సందీప్‌ మెహతాలను కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరి నియామకాన్ని కేంద్రం ఆమోదిస్తే సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 34కు చేరనుంది. 


ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  ఉన్న జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ, గతంలో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2021 అక్టోబర్‌ 11న తెలంగాణ హైకోర్టుకు సీజేగా వచ్చిన ఆయన 2022 జూన్‌ 8న ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న గౌహతి హైకోర్టుకు సీజేగా జస్టిస్‌ సందీప్‌ మెహతా నియమితులయ్యారు. జస్టిస్‌ ఏజీ మాసిహ్‌ ఈ ఏడాది మే 30న రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.