Muzaffarnagar Student Slapping Case: 



ముజఫర్‌నగర్ ఘటనపై విచారణ..


యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో మహిళా టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో సంచలనమైంది. నెల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇంకా విచారణ కొసనాగుతూనే ఉంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన మొత్తం రాష్ట్రాన్నే వణికించిందని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో యూపీ ప్రభుత్వాన్నీ మందలించింది. ఈ కేసు విచారణకు వెంటనే ఓ IPS అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా ఆ IPS అధికారి దీనిపై నివేదిక రూపొందించి కోర్టుకి సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో బాధిత బాలుడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని, మిగతా విద్యార్థులతోనూ మాట్లాడాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


"ఇది చాలా తీవ్రమైన విషయం. ఓ వర్గానికి చెందిన విద్యార్థిని టార్గెట్ చేసి తోటి విద్యార్థులతో చెంప దెబ్బ కొట్టించడం సహించరానిది. ఇదేనా చదువంటే..? ఆ బాధిత విద్యార్థి చదువు బాధ్యత అంతా ప్రభుత్వానిదే. నిజంగా ఓ వర్గానికి చెందిన విద్యార్థిని ఉద్దేశపూర్వకంగా కొట్టించారన్న ఆరోపణలు నిజమే అయితే కచ్చితంగా ఇది రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుంది"


- సుప్రీంకోర్టు 


ప్రభుత్వ తీరుపై అసహనం..


ఈ కేసు విచారణలో ప్రభుత్వం తీరుపైనా అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. FIR నమోదు చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని ప్రశ్నించింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. జస్టిస్ పంకజ్ మిథాల్‌తో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండి పడింది. విద్యాహక్కు చట్టం కింద కచ్చితంగా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఓ వర్గానికి చెందిన విద్యార్థిపై ఇలాంటి దాడి జరిగిందంటే కచ్చితంగా అక్కడ నాణ్యమైన విద్య అందడం లేదనే పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. 


ఇదీ జరిగింది..


గత నెలలో యూపీలోని ముజఫర్‌నగర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. ఓ ముస్లిం విద్యార్థిని ఓ హిందూ విద్యార్థితో కొట్టించింది మహిళా టీచర్. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖబర్‌పూర్‌ గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై విచారణ మొదలు పెట్టారు. ఈ వీడియోలో టీచర్‌ ముస్లింలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. క్లాస్‌లో ఉన్న విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని కొట్టాలని ఆదేశించింది. టీచర్‌ చెప్పినట్టుగానే విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని చెంపపై కొట్టారు. ఇలా కొడుతూ ఉండగా చైర్‌లో కూర్చున్న టీచర్ "ఇంకా గట్టిగా కొట్టండి" అంటూ ఆర్డర్‌ వేసింది. ఓ స్టూడెంట్‌ చెంపమీద కొట్టినా ఆగకుండా...నడుముపైన కొట్టండి అంటూ కుర్చీలో కూర్చుని ఆర్డర్‌లు వేసింది ఆ మహిళా టీచర్.


Also Read: రూమ్‌లో ఫుల్‌గా ఏసీ పెట్టుకుని పడుకున్న డాక్టర్, చలికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు మృతి