Sulabh Complex Founder: గుండెపోటుతో సులభ్ కాంప్లెక్సుల వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత
Sulabh Complex Founder: సులభ్ కాంప్లెక్స్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మృతి చెందారు. ఈయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

Sulabh Complex Founder: సామాజిక ఉద్యమకారుడు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు 80 ఏళ్ల బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో మృతి చెందారు. దిల్లీలో స్వాతంత్ర దినోత్సవం రోజు అది కూడా జెండా ఎగుర వేసిన కాసేపటికే ఆయన కుప్పకూలి పడిపోయారు. ఆ తర్వాత కాసేపటికే ఎయిమ్స్ లో తుది శ్వాస విడవడం బాధాకరం. దేశంలో పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేసిన ఆయన.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బిందేశ్వర్ పాఠక్ మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక పురోగతికి, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ నిర్మాణమే లక్ష్యంగా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. స్వచ్ఛత, పరిశుభ్రత పట్ల ఆయనకు ఉన్నఅభిరుచి తమ సంభాషణల్లో స్పష్టంగా తెలసేదని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆయన విశేష సహకారం అందించారని అన్నారు. ఆయన చేసిన సేవలు ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
1970లో సులభ్ శౌచాలయ సంస్థాన్ ఏర్పాటు
బిందేశ్వర్ ఫాఠక్ బిహార్ లోని వైశాలి జిల్లా రాంపూర్ బాఘేల్ గ్రామంలో 1943 ఏప్రిల్ 2వ తేదీన జన్మించారు. 1964లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత పాట్నా యూనివర్సిటీ నుంచి సషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాట్నా యూనివర్సిటీ నుంచి 1980లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయగా.. 1985లో పీహెచ్ డీ పూర్తి చేశారు. దేశంలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఆయన 1970లో సులభ్ శౌచాలయ సంస్థాన్ ను స్థాపించారు. క్రమంగా అది అంతర్జాతీయ సులభ్ సామాజిక సేవా సంస్థగా రూపుదాల్చింది. ఈయన ప్రవేశ పెట్టిన కొత్త మరుగుదొడ్డి లేదా శౌచాలయాన్ని మొదట్లో వాడేందుకు చాలా మంది ఇబ్బంది పడినప్పటికీ.. ఆ తర్వాత అందరూ ఉపయోగించడం ప్రారంభించారు.
పర్యావరణ కాలుష్యాన్ని పరిష్కరించేందుకు ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆయనకు పద్మ భూషమ్ అవార్డును అందించింది. అలాగే పారిశుద్ధ్యం, పరిశుభ్రత రంగంలో ఆయన చేసిన కృషికి వివిధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆధ్వర్యంలో రైలు ప్రాంగణంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో 2016లో బిందేశ్వర్ స్వచ్ఛ రైలు మిషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.
Read Also: వచ్చే ఆగస్టు 15న మళ్లీ వస్తున్నా- కలలన్నీ నెరవేరుస్తా: మోదీ