Continues below advertisement

సుక్మా: ఆపరేషన్ కగార్ ద్వారా మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్ మరణించారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 12 మంది నక్సల్స్‌ను ఆదివారం నాడు గుర్తించారు. ఈ మేరకు సుక్మా ఎస్‌పీ కిరణ్ చవాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నక్సల్స్ వివరాలను వెల్లడించారు. ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలం నుండి జవాన్లు AK-47, SLR, INSAS రైఫిల్, BGL లాంచర్, 12 బోర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు.

చనిపోయిన ఈ 12 మంది నక్సల్స్‌పై మొత్తం 60 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు తెలిపారు. సుక్మా జిల్లాలో ఇప్పుడు నక్సలిజం చివరి దశకు వచ్చేసిందని, కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోందని ఎస్‌పీ తెలిపారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో బార్సే దేవా సహా 20 మంది నక్సల్స్ లొంగిపోవడంతో PLGA బెటాలియన్ నంబర్-1లో కేవలం 100 నుండి 120 మంది నక్సల్స్ మాత్రమే మిగిలి ఉన్నారని ఆయన తెలిపారు. మిగిలిన మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. లేదా కొందరు మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోనే ఇతర ప్రాంతాల్లో తలదాచుకోగా, కొందరు తెలంగాణలో లొంగిపోయారు.

Continues below advertisement

సుక్మాలో కొన ఊపిరితో నక్సలిజం

ఎన్‌కౌంటర్ వివరాలను సుక్మా ఎస్‌పీ కిరణ్ చవాన్ వివరించారు. సుక్మా జిల్లా దక్షిణ ప్రాంతంలోని కిష్టారామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పమలూర్ అడవుల్లో సాయుధ నక్సల్స్ ఉన్నారనే ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా నుండి DRG బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో శనివారం ఉదయం భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య భీకర కాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్ సమయంలో సంఘటనా స్థలం నుండి 12 మంది మావోయిస్టుల మృతదేహాలు సహా ఆయుధాలతో సహా స్వాధీనం చేసుకున్నారు., వీరిలో 5 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో కిష్టారామ్ ఏరియా కమిటీ ఇన్‌ఛార్జ్ DVCM సభ్యుడు వట్టి మంగు అలియాస్ ముక్కా కూడా మరణించాడు. అతనిపై 8 లక్షల రూపాయల రివార్డు ఉందని సుక్మా ఎస్‌పీ తెలిపారు. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో అతనిపై 41కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో సాధారణ గ్రామస్తుల హత్య, IED బ్లాస్ట్‌లు, 2010లో జరిగిన తాడ్‌మెట్ల సంఘటన, జీరం ఘాటి దాడి, పీడ్‌మెల్- చింతగుఫా పోలీసు- నక్సల్స్ ఎన్‌కౌంటర్, బుర్కపాల్-చింతగుఫా దాడి, మీన్‌పా-చింతగుఫా దాడి వంటి ప్రధాన కేసులు సైతం ఉన్నాయి.

ఎన్‌కౌంటర్‌లో మరణించిన రివార్డు నక్సల్స్

మంగుతో పాటు, ఈ ఎన్‌కౌంటర్‌లో ఏరియా కమిటీ సెక్రటరీగా ఉన్న మాడ్వి హితేష్ అలియాస్ హుంగాపై 8 లక్షల రూపాయల రివార్డు ఉందని తెలిపారు. అలాగే, CYPC పోడియం జోగా, PLGA బెటాలియన్ నంబర్-1 డిప్యూటీ కమాండర్ పై రూ. 10 లక్షల రివార్డు ప్రకటించారు. ఏరియా కమిటీ సభ్యుడు కోమరం బద్రీపై 5 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యుడు జిత్రు మాండవిపై రూ.5 లక్షల రివార్డు, మాడ్వి సుక్కాపై 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యుడు ముచాకి మున్నీపై 5 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యుడు మాడ్వి జమ్లీపై రూ. 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యుడు పోడియం రోషిణిపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ ప్రకటించారు.

వీరితో పాటు, పార్టీ సభ్యుడు తామో నందాపై 2 లక్షల రూపాయల రివార్డు, పార్టీ సభ్యుడు మడ్కం రామాపై రూ. 1 లక్ష రివార్డు, మావోయిస్టు పార్టీ సభ్యుడు మాసేపై 1 లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ 12 మంది నక్సల్స్‌పై మొత్తం రూ. 60 లక్షల వరకు రివార్డు ఉందని తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలం నుండి జవాన్లు ఒక AK-47, ఒక SLR రైఫిల్, ఒక INSAS రైఫిల్, 4 BGL లాంచర్లు, 12 బోర్ రైఫిల్, 3 వైర్‌లెస్ సెట్‌లు, 2 స్కానర్ సెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.