India likely to Host 2036 olympics | వారణాసి: 2026 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారతదేశం పూర్తిగా సన్నద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం నాడు (జనవరి 4న) ఈ విషయాన్ని ప్రకటించారు. గత పదకొండున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశంలో క్రీడా రంగంలో సమూల మార్పులు చేసి, 20కి పైగా ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లను నిర్వహించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. భారత్ 'పూర్తి సన్నద్ధతతో' 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ఆయన అన్నారు.
20కి పైగా అంతర్జాతీయ టోర్నమెంట్స్ నిర్వహించిన భారత్
వారణాసిలో నేడు ప్రారంభమైన 72వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘గత దశాబ్దంలో ఫిఫా అండర్-17 ప్రపంచ కప్, హాకీ ప్రపంచ కప్ సహా 20కి పైగా ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లను దేశంలోని పలు నగరాల్లో నిర్వహించామని తెలిపారు. 2030 కామన్వెల్త్ క్రీడలు కూడా భారత్‌లోనే జరగనున్నాయి. భారత్ పూర్తి సన్నద్ధతతో 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని చూస్తోంది. ఎక్కువ మంది క్రీడాకారులకు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని’ చెప్పారు.
క్రీడా రంగంలో సమూల మార్పులు
దేశం ప్రస్తుతం 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్' పై ప్రయాణిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి రంగం, అభివృద్ధి నిర్వచనం ఈ 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్' తో ముడిపడి ఉందని, క్రీడలు కూడా అందులో ఒకటని అన్నారు. ‘క్రీడా రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టింది. నేషనల్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, ఖేలో ఇండియా పాలసీ 2025... వంటి నిబంధనల ద్వారా సరైన ప్రతిభకు అవకాశం లభిస్తుంది. తద్వారా క్రీడా రంగంలో పారదర్శకత పెరుగుతుంది. అలాగే దేశ యువత క్రీడలు, విద్య రెండింటిలోనూ ఒకేసారి ముందుకు సాగనున్నారు. ఒకవైపు మనం మెరుగైన మౌలిక సదుపాయాలు, నిధుల సమీకరణ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం. దాంతో పాటు యువతకు అద్భుతమైన జీవితాన్ని క్రీడల ద్వారా అందించడానికి కూడా కృషి చేస్తున్నాం’ అన్నారు.
క్రీడలపై ప్రభుత్వం, సమాజంలో చిన్న చూపు ఉండేది
ఒకప్పుడు క్రీడల పట్ల ప్రభుత్వం, సమాజంలో సైతం ఉదాసీనత ఉండేదని మోదీ అన్నారు. చాలా తక్కువ మంది యువకులు క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేవారు. గత దశాబ్దంలో క్రీడల పట్ల ప్రభుత్వం, సమాజం ఆలోచనలలో మార్పు కనిపిస్తోందని మోదీ అన్నారు. క్రీడా రంగంలో తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, ‘మేం స్కూల్ స్థాయిలో కూడా క్రీడాకారులకు ఒలింపిక్ అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తున్నాం. ఖేలో ఇండియా ప్రచారం వల్ల వందలాది మంది యువకులకు జాతీయ స్థాయిలో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల కిందట ఎంపీ క్రీడా మహోత్సవం జరిగింది. ఇందులో కూడా దాదాపు కోటి మంది యువకులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపీ క్రీడా మహోత్సవం సందర్భంగా కాశీకి చెందిన దాదాపు 3 లక్షల మంది యువకులు మైదానంలో సత్తా చాటారు.
వారణాసిలో వివిధ క్రీడలకు సంబంధించిన స్టేడియాలు నిర్మిస్తున్నాం. కొత్త క్రీడా సముదాయంలో చుట్టుపక్కల జిల్లాల క్రీడాకారులకు కూడా శిక్షణ పొందే అవకాశం లభిస్తోంది. మెగా టోర్నీలకు వారణాసి సిద్ధమవుతుండటంతో నాకు సంతోషంగా ఉంది. వాలీబాల్ జాతీయ పోటీల ద్వారా దేశ క్రీడల్లో నగరం స్థానం సంపాదించుకుంటుందని’ ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.