బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్‌స్వామి సంచలన పోస్ట్ చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.  1950లో రైలు ప్రమాదం జరిగినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు.  అదే విధంగా నేడు అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

గురువారం మధ్యాహ్నం ఊహించని విషాదం..గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన AI171 Boeing 787 Dreamliner ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కాసేపటికే మేఘాని నగర్‌ ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతంలో ఇంజిన్లు ఫెయిలై ఎగరలేక కూలిపోయింది. జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్ లపై కూలడంతో అందులో ఉంటున్న మెడికోలలో 20 మందికి పైగా మృతిచెందారని సమాచారం. 

సిబ్బంది, ప్రయాణికులు కలిపి 242 మంది

ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది సహా 242 ప్రయాణికులు అందులో ఉన్నారు. జూన్ 12న మధ్యాహ్నం 1.39 సమయంలో ఎయిరిండియా విమానం క్రాష్ అయిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 620 అడుగుల ఎత్తులో ఎయిరిండియా విమానం సిగ్నల్స్ కోల్పోయింది. ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787 డ్రీమ్‌ లైనర్‌ గత 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. ఇందులో దాదాపు 300 మంది వరకు ప్రయాణించవచ్చు అని అధికారులు తెలిపారు. 

ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి వేర్వేరుగా మాట్లాడారు. ఘటన జరిగిన తీరు, కారణాలను ఆరా తీశారు. వీరిద్దరిని అహ్మదాబాద్ వెళ్లి, పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.