ఈమధ్య రైళ్లపై రాళ్లు రువ్వే ఉన్మాదులు ఎక్కువయ్యారు. ముఖ్యంగా వందే భారత్ రైళ్ల మీద ఇలాంటి దాడులు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. దాంతో ట్రైన్ డామేజీ కావడంతో పాటు అభంశుభం తెలియని ప్రయాణికులు గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రైల్వేశాఖ సీరియస్‌ హెచ్చరికలు జారీ చేసింది. రైలు ప్రయాణించే సమయంలో ఎవరైనా రాళ్లు రువ్వితే శిక్షలు మామూలుగా ఉండవని వార్నింగ్ ఇచ్చింది. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెసేజ్ పాస్ చేసింది.


రైళ్లపై దాడిచేసినా, రైల్వే ఆస్తులకు నష్టం చేకూర్చనా RPF చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలవుతాయి. కేసు ఒక పట్టాన తెమలదు. నిందితులు ఎంతటివారైనా అతీతులు కారు. రైలురోకో కేసులు ఇప్పటికీ ఎదుర్కుంటున్న నాయకులు చాలామందే ఉన్నారు. రైళ్లపై రాళ్లు విసిరితే రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు . దాంతోపాటు 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 


దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రాళ్లు రువ్విన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి  ఇటీవలి కాలంలో కాజీపేట-ఖమ్మం, కాజీపేట- భువనగిరి, ఏలూరు - రాజమండ్రి వంటి ఏరియాల్లో వందే భారత్ రైళ్లను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. జనవరి, 2023 నుండి ఈ ఘటనలు 9 వరకు జరిగాయి. ఫలితంగా ట్రైన్ రీషెడ్యూల్‌ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులంతా అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ రకమైన దాడుల మూలంగా ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది చావు అంచులదాకా వెళ్లివచ్చారు. కొన్నిచోట్ల వందే భారత్ రైలు ప్రారంభానికి ముందే రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై రాళ్లు విసిరారు. ఈ  దాడిలో రెండు కోచ్‌ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆకతాయిలను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.


ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకునేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నిరంతరం శ్రమిస్తోంది. ఇప్పటివరకు ఆర్పీఎఫ్ పలు కేసులు నమోదు చేసింది. 39 మందిని అరెస్టు చేసి జైలుకు పంపింది. కొన్ని దాడుల ఘటనల్లో 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలను ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తల్లిదండ్రులే చొరవతీసుకున మందలించాలని రైల్వేశాఖ కోరింది.  


రైళ్లపై రాళ్లదాడి ఘటనలు జరగకుండా , రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. ట్రాక్‌ల సమీపంలోని గ్రామాల సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుంటోంది.  రాళ్లు రువ్వే  ప్రమాద స్థలాలన్నింటిలో కూడా  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్  సిబ్బందిని పెట్టింది. ఎవరైనా రాళ్లు రువ్వుతుంటే చూసిన వారు సమాచారాన్ని షేర్ చేయాలన అభ్యర్ధించింది. రాళ్లు రువ్వుతున్నవారు ఎవరి దృష్టికైనా వస్తే వెంటనే 139కి డయల్ చేసి చెప్పాలని కోరింది. 


జాతీయ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్  కుమార్  జైన్ కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పౌరులే సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు. తమ పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, ఇలాంటి దుష్ట చేష్టల కారణంగా కలిగే  పరిణామాల  గురించి వారికి అవగాహన కల్పించాలని ద.మ. రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్  కుమార్  జైన్ విజ్ఞప్తి చేశారు.