No-confidence Motion : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు ఏబీపీ లైవ్‌కి తెలిపాయి. లోక్ సభలో పక్షపాతంగా వ్యవహరిస్తున్న స్పీకర్ బిర్లాపై సోమవారం.. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడుతున్నట్లు సమాచారం. 2019 పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు  దోషిగా తేల్చింది. రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్షఖరారు చేసింది. ఈ తీర్పుతో లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించింది. అనంతరం రాహుల్ కు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీపై ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. 


అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ 


అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణకు ప్రతిపక్షాల పిలుపుపై ​​పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పదేపదే వాయిదా పడుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు సభకు నలుపు రంగు దుస్తులు ధరించి వచ్చారు. స్పీకర్ కుర్చీపై చిత్తు కాగితాలను  విసిరారు. సభాపతి సభ నుంచి బయటకు వెళ్లిన తర్వాత సభాపతిపై బ్యానర్‌ కూడా విసిరినట్లు తెలుస్తోంది.  లోక్‌సభలో విపక్షాల డిమాండ్లను సైలెంట్ చేసేందుకు మైకులు మూగబోయాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మార్చి 17న కాంగ్రెస్ ట్విటర్‌లో ఒక క్లిప్‌ను పంచుకుంది, దీనిలో లోక్‌సభలో ఆడియో ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాల నిరసనలు చేస్తుండగా ఒక్కసారి మైకులు సైలెంట్ అయిపోయాయి.  


"ఇంతకుముందు, మైక్ ఆఫ్ చేశారు, ఈ రోజు సభ కార్యకలాపాలు కూడా మ్యూట్ అయ్యాయి. ప్రధాని మోదీ స్నేహితుడి కోసం సభ మూగబోయింది" అని అదానీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.






స్పీకర్ ఓం బిర్లా ఏమన్నారంటే?


 ప్రతిపక్ష ఎంపీలను మాట్లాడనివ్వడం లేదన్న ఆరోపణలను స్పీకర్ ఓం బిర్లా తోసిపుచ్చారు. మనకు బలమైన ప్రజాస్వామ్యం ఉందని, పౌరుల ఆశలు, ఆకాంక్షలు ఎన్నికైన ప్రతినిధుల ద్వారా వ్యక్తీకరించే శక్తివంతమైన బహుళ పార్టీ వ్యవస్థను కలిగి ఉన్నామన్నారు. సభ్యులందరూ తమ అభిప్రాయాలను, ఆలోచనలను పార్లమెంటులో చెప్పే స్వేచ్ఛ ఉందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ప్రతిపక్ష ఎంపీల మైక్‌లు ఆఫ్‌ చేశాయని బ్రిటిష్ ఎంపీల బృందంతో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగింది. విదేశాల్లో దేశం పరువుతీశారని రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. రాహుల్ క్షమాపణ చెప్పే వరకు సభలో మాట్లాడనివ్వమని ఆయనను అడ్డుకుంది.