PAN-Aadhaar Link Deadline Extended: పాన్‌ కార్డ్‌హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం మరో ఊరట ప్రకటించింది. పాన్‌-ఆధార్ నంబర్‌ అనుసంధానం గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ (CBDT) ప్రకటించింది, 2023 జూన్‌ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. 


పాన్‌-ఆధార్ సంఖ్య అనుసంధానం గడువు పెంపుపై CBDT ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించడానికి ఈ డెడ్‌లైన్‌ను ‍‌(PAN-Aadhaar Link Deadline) 2023 మార్చి 31వ తేదీ నుంచి 2023 జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించింది. 






"ఆదాయపు పన్ను చట్టం -1961లోని నిబంధనల ప్రకారం, జులై 1, 2017 నాటికి పాన్‌ పొంది, ఆధార్ నంబర్‌ను పొందే అర్హత ఉన్న ఎవరైనా నిర్ణీత రుసుము చెల్లించి మార్చి 31, 2023లోపు ఆధార్ నంబర్‌ను ఆదాయ పన్ను సంస్థతో పంచుకోవాలి. ఈలోగా పాన్‌-ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయకపోతే ఏప్రిల్ 1, 2023 నుంచి పన్ను చెల్లింపుదార్లు సంబంధిత చర్యకు బాధ్యతవుతారు, మరింత జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ గడువును 30 జూన్ 2023 వరకు పొడిగించడం జరిగింది. కొత్త గడువు వరకు లోగా పాన్ కార్డ్‌హోల్డర్ తన ఆధార్‌ను లింక్ చేయకపోతే, సంబంధిత వ్యక్తికి చెందిన పాన్ కార్డ్ నిష్క్రియంగా (నాన్-ఆపరేటివ్‌) మారుతుంది. తదనంతర పరిణామాల భారాన్ని అతను భరించవలసి ఉంటుంది" - CBDT


లింక్‌ పూర్తి కాకపోతే రిఫండ్‌ రాదు                        
కొత్త గడువు లోగా కూడా పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయని పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్‌ రాదు. PAN పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు. అటువంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ మొత్తంలో TDS, TCS వసూలు చేస్తారు. 


పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసి, రూ. 1,000 చెల్లించిన తర్వాత, 30 రోజుల్లో పాన్ మళ్లీ క్రియాశీలంగా మారుతుంది.


పాన్-ఆధార్ లింకేజ్‌ నుంచి వీళ్లకు మినహాయింపు                
పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తులు, వర్గాలపై ఇటువంటి చర్యలు ఉండవు. నిర్దిష్ట రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు, చట్ట ప్రకారం నాన్ రెసిడెంట్‌లు. భారతీయ పౌరులు కాని వాళ్లు, గత సంవత్సరం నాటికి 80 ఏళ్లు పైబడిన వాళ్లు మినహాయింపు వర్గంలోకి వస్తారు.


ఇప్పటి వరకు 51 కోట్ల పాన్‌లను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar లింక్ ద్వారా పాన్‌తో ఆధార్‌ అనుసంధానించవచ్చు.