Surat Railway Station: పండుగలు వస్తే చాలు రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఉద్యోగ రీత్యా, పనుల నిమిత్తం, వ్యాపారం, చదువులు కోసం సొంత ఇంటికి దూరంగా ఎక్కడో ఉన్న వారందరూ సొంత ఊళ్లకు బయల్దేరతారు. వారంతా మొదటగా ప్రాధాన్యత ఇచ్చేది రైలు ప్రయాణానికే. తక్కువ ఖర్చుతో సొంత ఊరికి వెళ్లేందుకు వారందరికి ఉన్న ఏకైక వసతి రైలు మాత్రమే. సాధారణంగానే రైళ్లకు డిమాండ్ ఉంటుంది. అదే పండుగ వేళ అయితే ఆ పరిస్థితి చెప్పనవసరం లేదు. కాలు తీసి కాలు పెట్టలేనంత రద్దీగా ఉంటుంది. ఇంటికి వెళ్లేందుకు ఒక మినీ యుద్ధమే చేయాల్సి వస్తుంది.


పండుగకు ఇంటికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు రద్దీలో చిక్కుకుని మృతిచెందాడు. మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ రైల్వేస్టేషన్‌ (Surat Railway Station)లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. సూరత్‌లోని వజ్ర, వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే వేలాది వలస కార్మికులు ఏటా ఛఠ్‌ పూజ (Chhath festival) సమయంలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సూరత్‌లో ఉంటున్న వారు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 


పెద్దఎత్తున ప్రయాణికులు శనివారం సూరత్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో స్టేషన్‌ ప్రాంతం అంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఆ సమయంలోనే బిహార్‌కు వెళ్లే రైలు ప్లాట్‌ఫాంపైకి చేరుకుంది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా రైలు ఎక్కేందుకు యత్నించారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. రైలు ఎక్కే క్రమంలో ప్రయాణికుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పలువురు స్పృహతప్పి పడిపోయారు. వారిలో ఒకరిపై నుంచి ప్రయాణికులు వెళ్లడంతో ఊపిరి ఆడక మృతి చెందాడు.


తొక్కిసలాటతో కిందపడిపోయిన ప్రయాణికుల్లో ఒకరికి గుండె సంబంధిత సమస్య తలెత్తిందని, అతడికి సీపీఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతుడు అంకిత్ వీరేంద్ర సింగ్‌గా గుర్తించారు. మరో ఇద్దరు ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్‌లో విపరీతమైన రద్దీ ఉందని, దీని కారణంగా కొంతమంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అస్వస్థతకు గురైన వారి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు.


ఘటనపై  హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి (Harsh Sanghavi) స్పందించారు. రైల్వేస్టేషన్‌లో పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసులు తమవంతు ప్రయత్నం చేశారని మీడియాకు చెప్పారు. పండగ సీజన్‌లో రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపడంతోపాటు స్టేషన్‌లలో రద్దీ నిర్వహణ, భద్రత, అదనపు సిబ్బంది మోహరింపు వంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పశ్చిమ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.  సూరత్‌లోని వజ్ర, వస్త్ర పరిశ్రమల్లో బిహార్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు వేల సంఖ్యలో పని చేస్తుంటారు. వీరంతా దీపావలి సందర్భంగా జరిగే ఏటా ఛఠ్‌ పూజలో పాల్గొనేందుకు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే సూరత్‌ స్టేషన్‌లో ప్రమాదం జరిగింది.