Srinagar’s Tulip Garden enters World Book of Records: జమ్ము కాశ్మీర్‌లోని ప్రముఖ ఇందిరాగాంధీ స్మారక తులిప్‌ గార్డెన్‌కు అరుదైన గుర్తింపు లభించింది.‌ ఆసియాలోనే అతి పెద్ద గార్డెన్‌గా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (లండన్‌)లో చోటు దక్కించుకుంది. 68 రకాలతో దాదాపు 1.5 మిలియన్ల తులిప్‌ పుష్పాలతో ఉండే గార్డెన్‌ అరుదైన ఘనత సాధించినట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి తన ఎక్స్‌(ట్విట్టర్‌) ఖాతా ద్వారా వెల్లడించారు.


వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సీఈఓ సంతోష్‌ షుక్లా శనివారం తులిప్‌ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్లోరికల్చర్‌, గార్డెన్‌ అండ్‌ పార్క్స్‌ కమిషనర్‌ సెక్రటరీ షేక్ ఫయాజ్‌ అహ్మద్‌కు గుర్తింపు పత్రాన్ని అందించారు. తులిప్‌ గార్డెన్‌కు ఈ గుర్తింపును అందించినందుకు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు షేక్‌ ఫయాజ్‌ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇది తులిప్‌ గార్డెన్‌కు ఒక మైలు రాయిగా నిలుస్తుందని, శ్రీనగర్‌ పుష్పసంద ఖ్యాతిని పెంచుతుందని, కాశ్మీర్‌లో ఆర్థిక వృద్ధికి ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఎడిటర్‌ దిలీప్‌ ఎన్‌ పండిత్‌, ఇతర కశ్మీర్ అధికారులు పాల్గొన్నారు. ఇందిరా గాంధీ మెమోరియల్‌ తులిప్‌ గార్డెన్‌కు ఈ అరుదైన గుర్తింపు దక్కడం పట్ల వరల్డ్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సీఈఓ సంతోష్‌ షుక్లా అభినందనలుతెలిపారు. ఇక్కడ ఎంతో అందమైన పుష్పాల రకాలు ఉన్నాయని అన్నారు. ప్రకృతి వైభవానికి ఇది చిహ్నంగా ఉంటుందని అన్నారు.


తులిప్‌ గార్డెన్‌ శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు, జబర్వాన్‌ పర్వత ష్రేణుల దిగువన దాదాపు ౩౦ హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా తులిప్‌ గార్డెన్స్‌ ఉన్నప్పటికీ ఆసియాలో ఇదే అతి పెద్దది.ఈ గా ర్డెన్‌లోని తులిప్‌ పుష్పాలను చూసేందుకు ఏటా లక్షల మంది పర్యటకులు వస్తుంటారు. కశ్మీర్‌లో పర్యాటకాన్ని, ఫ్లోరికల్చర్‌ను అభివృద్ధి చేసేందుకు 2007లో ఈ పార్క్‌ను ప్రారంభించారు. ఇక్కడ ఏటా వసంత రుతువు సమయంలో తులిప్‌ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిస్తుంటారు. రకరకాల రంగుల్లో, వెరైటీలలో తులిప్‌ పూలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.