Special Parliament Session: 



సెప్టెంబర్ 19న కొత్త పార్లమెంట్‌లో..


సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. అయితే...ఈ ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంట్ బిల్డింగ్‌లో జరుగుతాయా..? లేదంటో కొత్త భవనంలో నిర్వహిస్తారా అన్న అనుమానాలు తలెత్తాయి. ఈ విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 18న అంటే...తొలి రోజు సమావేశాలు పాత బిల్డింగ్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. ఆ తరవాత సెప్టెంబర్ 19న  వినాయక చవితి ( Ganesh Chaturthi) సందర్భంగా కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ అవుతున్నట్టు వెల్లడించింది. అంటే...సెప్టెంబర్ 19-23 వరకూ కొత్త పార్లమెంట్ భవనంలోనే ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్‌ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే...ఇప్పటి వరకూ ఈ సమావేశాల అజెండా ఏంటన్నది స్పష్టంగా చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ విషయమై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని ప్రశ్నించగా...త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జూన్1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ని ప్రారంభించారు. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులోనే Sengolని ఏర్పాటు చేశారు.