Sonia Gandhi On Parliament Security Breach : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ (Congress)పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ (Sonia Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ (Bjp) ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ సర్కార్ ఊపిరి ఆడకుండా చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంటులో విపక్ష సభ్యులను బహిష్కరించడంపై తొలిసారి స్పందించారు. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని చట్టబద్ధమైన డిమాండ్‌ చేసినందుకు వేటు వేశారని సోనియా గాంధీ విమర్శించారు. సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్‌ను లేవనెత్తినందుకే ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులపై వేటు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ కూడా పార్లమెంట్‌ నుంచి ప్రతిపక్ష ఎంపీలను ఇలా సస్పెండ్‌ చేయలేదని గుర్తు చేశారు. 


ప్రధానికి నాలుగు రోజులు పట్టిందా ?
పార్లమెంట్ లో జరిగిన ఘటనపై స్పందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi)కి నాలుగు రోజుల సమయం పట్టిందా అని ప్రశ్నించారు. కీలకమైన విషయాలపై ప్రధాని మోడీ, తన అభిప్రాయాలను పార్లమెంట్ బయటే చెప్పడాన్ని సోనియా గాంధీ తప్పు పట్టారు. పార్లమెంట్ లోపల మాట్లాడకుండా...బయట మాట్లాడటం అంటే సభను అపహాస్యం చేయడమేనని విమర్శించారు. దేశ ప్రజలపై ప్రధాని నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇది నిదర్శమని సోనియా గాంధీ గుర్తు చేశారు. పార్లమెంటులో డిసెంబర్ 13న జరిగిన సంఘటన క్షమించరానిదని,  నిందితులు చేసిన దుశ్చర్యను ఎవరూ సమర్థించలేరని సోనియా గాంధీ అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ వంటి దేశభక్తులను కించపరిచేందుకు కొందరు హిస్టరీని తప్పు దోవ పట్టిస్తున్నారని, చారిత్రక వాస్తవాలను చెప్పుకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 


వాస్తవాలనే చెబుతాం
నిజాలను దాచిపెట్టడంలో, వాస్తవాలను చెప్పుకుండా పక్కదారి పట్టించడంలో ప్రధాన మంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా ముందున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు పాల్పడుతున్న తప్పుడు చర్యలకు భయపడేది లేదన్న సోనియా గాంధీ, వాస్తవాలను చెప్పేందుకు నిరంతర కృషి చేస్తామని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి పలు కీలక బిల్లులను...ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదముద్ర వేసుకున్నారని అన్నారు. సోమవారం పార్లమెంటులో  రికార్డు స్థాయిలో 78 మంది లోక్‌సభ సభ్యులు సస్పెండ్ అయ్యారు. మంగళవారం మరో 49 మందిపై వేటు పడింది. ఇప్పటి వరకు మొత్తం 141 మంది సస్పెండయ్యారు. సస్పెన్షన్ల తర్వాత విపక్ష సభ్యులు పార్లమెంటు భవన మెట్లపై కూర్చొని ఆందోళన చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ తృణమూల్‌ నేత కల్యాణ్‌ బెనర్జీ చేసిన హాస్య ప్రదర్శనను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వీడియో తీశారు. కొందరు నేతలు స్పీకర్‌ను అనుకరించారు. ఈ ఘటన తనను బాధకు గురిచేసిందని ధన్‌ఖడ్‌ తప్పుబట్టారు. 


ఓటమిని సమీక్షించుకుంటాం
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకున్నామని సోనియా గాంధీ వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో ఓటమి బాధ కలిగించిందన్న సోనియా, ఓటమికి కారణాలేంటో తెలుసుకున్నామని చెప్పారు. అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామన్న ఆమె, ఆత్మవిశ్వాసంతో వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకెళ్తామన్నారు.