MP's Suspension Row News:



141 మంది ఎంపీలు సస్పెండ్..


పార్లమెంట్ భద్రతా వైఫల్యం (Parliament Security Breach) ఘటనతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఈ దాడి వెనకాల ఉన్న మాస్టర్‌మైండ్‌తో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన తరవాత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగడం లేదు. సభలో ప్రధాని మోదీ సహా కేంద్రహోం మంత్రి అమిత్‌షా ప్రకటన  చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష ఎంపీలు. దాదాపు వారం రోజులుగా ఈ రభస కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే వరుసపెట్టి ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడుతోంది. వారం రోజుల క్రితం తొలిసారి 13 మంది ఎంపీలతో (MP's Suspension) మొదలైన ఈ సస్పెన్షన్‌ (Lok Sabha MP's Suspended) ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ రెండు సభల్లో కలిపి 141 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు ఈ వేటు పడింది. వీరిలో 95 మంది లోక్‌సభ ఎంపీలు కాగా..46 మంది రాజ్యసభ ఎంపీలు. డిసెంబర్ 14 నుంచి ఈ సస్పెన్షన్‌ కొనసాగుతూ వస్తోంది. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. డిసెంబర్ 13న లోక్‌సభలో దాడి జరిగింది. అప్పటి నుంచి సభలో చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. కీలక బిల్లులపై చర్చ జరగకుండానే ప్రవేశపెడుతున్నారన్న అసహనం ఇప్పటికే వ్యక్తమవుతోంది. 


ఎందుకు సస్పెండ్ చేశారు..?


రెండు సభల ప్రెసైడింగ్ ఆఫీసర్‌లు ఈ సస్పెన్షన్ వేటు వేశారు. అందుకు కారణం...ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ దాడిపై చర్చకు డిమాండ్ చేయడం. కేంద్ర హోం మంత్రి సభలో దీనిపై అధికారికంగా ఓ ప్రకటన చేయాలని పట్టుపడుతున్నారు. 2000 సంవత్సరంలో డిసెంబర్ 13వ తేదీనే పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిని ప్రస్తావిస్తూ...పార్లమెంట్‌కి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా అని ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. అయితే...ఎంపీలు ఎవరైనా ప్రభుత్వం నుంచి సమాధానాలు డిమాండ్ చేసే హక్కు ఉంటుంది. ఇది ప్రొసీడింగ్స్‌లో సర్వసాధారణం. కానీ కేంద్రం మాత్రం ఆ డిమాండ్‌లను పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పైగా సభలో గందరగోళం సృష్టిస్తున్నారన్న కారణం చూపించి సస్పెండ్ చేసినట్టు సమర్థించుకుంటోంది. అటు ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా రాజకీయ కుట్ర అని తేల్చి చెబుతున్నాయి. కేవలం తమ గొంతుని అణిచివేసేందుకు మోదీ సర్కార్ వేసిన ఎత్తుగడ అని విమర్శిస్తున్నాయి. ఇప్పటికే ఈ సస్పెన్షన్‌లపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi on MP's Suspension) అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌ నిర్వహించారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేస్తోందని, గతంలో ఎప్పుడూ ఇలా ఇంత మంది ఎంపీలు సస్పెండ్‌ అవ్వలేదని మండి పడ్డారు. భద్రతావైఫల్యంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తే..ఇలా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు. 


సర్క్యులర్..


సస్పెండ్ అయిన ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ ఓ సర్క్యులర్ (Lok Sabha Secratariat Circular) జారీ చేసింది. సస్పెన్షన్‌కి గురైన ఎంపీలెవరూ సభలోకి రావడానికి వీల్లేదని ఆ సర్క్యులర్‌లో చాలా స్పష్టంగా ఉంది. అంతే కాదు. ఈ సస్పెన్షన్‌ని ఎత్తి వేసేంత వరకూ కొన్ని హక్కులనూ కోల్పోనున్నారు. పార్లమెంట్‌ లాబీ, గ్యాలరీతో పాటు ఛాంబర్‌లోకి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. పార్లమెంటరీ కమిటీల్లోనూ సభ్యులుగా కొనసాగే అవకాశముండదు.