KCR On Lok Sabha Elections: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ మళ్లీ పొలిటికల్ ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన షాక్ నుంచి కేడర్‌ను బయటపడేయడంతోపాటు వచ్చే లోక్‌సభ ఎన్నకల్లో ఎక్కువ అభ్యర్థులను గెలిపించుకునే వ్యూహాలు రెడీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఈ మధ్యే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వేగంగా కోలుకుంటున్నారు. అందుకే ఆయన ఫోకస్‌ అంతా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పెట్టినట్టు కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్న టైంలో ఎంపీలకు అధినేత నుంచి బిగ్‌ అలర్ట్ వెళ్లింది. ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆ సందేశం. 


అందుబాటులో ఉండాలని అధినేత నుంచి సందేశం అందుకున్న బీఆర్‌ఎస్‌ ఎంపీలంతా ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. హైదరాబాద్ వచ్చిన ఎంపీలతో కేసీఆర్ విడివిడిగా భేటీ కానున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆ తప్పులకు అవకాశం ఇవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. 


మరోవైపు కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఆయన మళ్లీ మెదక్ నుంచి బరిలో ఉంటారని చెప్పుకుంటున్నారు. దీనిపై ఏమైనా చర్చిస్తారా అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే ఎంపీలుగా ఉన్న వారి స్థానంలో కొత్తి వారిని పెట్టాలనే డిమాండ్ కూడా పార్టీలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీనిపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 


లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కాంగ్రెస్ వ్యూహాలు రెడీ చేస్తోంది. కాంగ్రెస్ కీలక సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు బీజేపీలో కదలిక మొదలైంది. అందుకే బీఆర్‌ఎస్ అధినేత కూడా ఎంపీలతో మాట్లాడుతున్నారు. ఈ సమావేశాల్లో కేటీఆర్‌, హరీష్‌ ఇద్దరూ పాల్గొనే చాన్స్ ఉంది.