సమాజంలో ప్రస్తుత జరుగుతున్న పరిణామాలపై కోర్టులు సైతం విస్మయం చెందుతున్నాయి. కేవలం చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీయడం లాంటి వాటిని మార్గాలుగా ఎందుచుకోవడం సరికాదని ధర్మాసనాలు సూచిస్తున్నాయి. తండ్రిని కుమారుడు హత్య చేసిన కేసును తాజాగా బాంబే హైకోర్టు విచారించింది. దిగువ కోర్టు ఇచ్చిన శిక్ష సరైనదేనని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
కేవలం తండ్రి తనను తిట్టడం, హీనమైన భాషలో మాట్లాడాడు అనే కారణాలతో ఆయనను కుమారుడు హత్య చేయడాన్ని బాంబే హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. తండ్రిని హత్య చేసి కేసులో ఓ యువకుడికి జీవిత ఖైదు విధిస్తూ ఔరంగాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. పొరపాటున చేసిన హత్య కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యగా బాంబే హైకోర్టు పేర్కొంది. కొల్హాపూర్, షిర్డీకి చెందిన ఒక పూజారికి విధించిన యావజ్జీవ కారాగార శిక్ష సరైనదేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ కేసు వివరాలిలా ఉన్నాయి..
డిసెంబర్ 2014లో ఉస్మానాబాద్ నివాసి నేతాజీ టెలీ (29) దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విశ్వాస్ జాదవ్, సందీప్ కుమార్ మోరేలతో కూడిన ధర్మాసనం తాజాగా విచారించింది. ప్రాసిక్యూషన్ వాదనల ప్రకారం.. కొల్హాపూర్ మరియు షిర్డీ దేవాలయాలలో పూజారిగా సేవలు అందిస్తున్న నేతాజీని వేరే ఆలయాలలో పని చేయాలని తండ్రి సూచించారు. ఈ విషయం నచ్చక తండ్రితో నేతాజీ గొడవపడ్డాడు. ఈ క్రమంలో వాదనకు దిగి తన తండ్రిపై నేతాజీ చెయ్యి చేసుకున్నాడు. దీనిపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుమారుడ్ని దూషించాడు.
తండ్రి తనను దూషించడంతో తీవ్ర ఆవేశానికి లోనైన నేతాజీ విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. కత్తితో తన తండ్రిని పొడిచి దారుణంగా హత్య చేశాడు. 2013 డిసెంబర్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఔరంగాబాద్ కోర్టులో విచారణ జరగగా తండ్రిని హత్య చేసిన కేసులో 2014లో నేతాజీని దోషిగా తేల్చారు. జీవిత ఖైదు విధిస్తూ దిగువకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు నేతాజీ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.
తన తండ్రి దూషించడంతో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి ప్రవర్తించినట్లు కోర్టులో చెప్పాడు నేతాజీ. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తండ్రి తనను అగౌరవపరచడం, దూషించడం వల్ల హత్యకు దారి తీసిందని చెప్పుకొచ్చాడు. వాదనలు విన్న జస్టిస్ విశ్వాస్ జాదవ్, సందీప్ కుమార్ మోరేలతో కూడిన ధర్మాసనం నేతాజీ చర్య సహేతుకం కాదని చెప్పింది. తిట్టాడన్న కారణంతో తండ్రిని హత్య చేయడం సరికాదని, విచక్షణ కోల్పోయి హత్య చేయడం తప్పిదమని చెబుతూ.. దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్ష సరైనదేనని తీర్పిచ్చారు.