Smriti Irani :   కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.  స్మృతి ఇరానీ  కుమార్తె జోయిష్‌ ఇరానీ వ్యాపారవేత్త. ఆమెకు  పలు చోట్ల హైక్లాస్ బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రసిద్ధ పర్యాటక రాష్ట్రం గోవాలోనూ ఆమెకు ఓ హైక్లాస్ బార్ అండ్ రెస్టారెంట్  ఉంది.  ఉత్తర గోవాలోని అస్సగావ్‌లో ఉన్న హైక్లాస్‌ రెస్టారెంట్‌లో బార్‌ లైసెన్స్‌ చనిపోయిన వ్యక్తి పేరు మీద తీసుకున్నారు. పైగా ఆ లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత చనిపోయిన వ్యక్తి పేరు మీదే రెన్యూవల్ చేసుకున్నారు.  బార్ అండ్ రెస్టారెంట్‌ను నడిపిచేస్తున్నారు. అధికార దుర్వినియోగం చేసి ఇలా చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 


దీనిపై గోవా ఎక్సైజ్‌ కమిషనర్‌ నారాయణ్‌ ఎం.గడ్‌ కేంద్రమంత్రి కుమార్తెకు చెందిన సిల్లీ సోల్స్‌ కేఫ్‌ అండ్‌ బార్‌కు  21వ తేదీన  షోకాజ్‌ నోటీసు జారీచేశారు. తప్పుడు పద్ధతుల్లో, నకిలీ పత్రాల ద్వారా ఆమె మద్యం లైసెన్స్‌ పొందారని న్యాయవాది ఏరిస్‌ రోడ్రిగ్స్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ నోటీసు ఇచ్చారు. లైసెన్స్‌ పొందిన  అంథోనీ దిగామా 2021 మే 17న మరణించారు. అయినప్పటికీ  పేరు మీదే గతనెల లైసెన్స్‌ పొడిగింపు పొందారన్నారు. అయినప్పటికీ అతడి పేరు మీదే గతనెల 22న దరఖాస్తు చేసుకొని రిన్యూవల్‌ పొందారు. దరఖాస్తుపై అతడికి బదులుగా మరొకరు సంతకం చేశారు.


సమాచార హక్కు చట్టం ( RTI ) ద్వారా రోడ్రిగ్స్‌ ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను  లాయర్ పొందారు. కేంద్రమంత్రి కుటుంబ సభ్యులు పాల్పడిన ఈ మెగా మోసంపై లోతుగా దర్యాప్తు జరపాలని, ఇందులో ఎక్సైజ్‌ అధికారులు, అస్సగావ్‌ గ్రామపెద్దలు మిలాఖతయ్యారని  న్యాయవాది ఏరిస్‌ రోడ్రిగ్స్‌  ఆరోపించారు. నిజానికి గోవాలో బార్‌ లైసెన్స్‌ ఇవ్వాలంటే ముందుగా రెస్టారెంట్‌ ఉండాలి. కానీ రూల్స్‌ గాలికి వదిలేసి గత ఏడాది ఫిబ్రవరిలో అప్పటికింకా రెస్టారెంట్‌ లైసెన్స్‌ పొందని సిల్లీ సోల్స్‌కు బార్‌ లైసెన్స్‌ కట్టబెట్టారని ఆయన చెబుతున్నారు. 


మొత్తం ఎక్సైజ్‌ దరఖాస్తులన్నీ ముంబై విల్లెపార్లేకు చెందినట్టుగా చెప్తున్న దిగామా పేరుమీదనే సమర్పించారు. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ జారీ చేసిన దిగామా డెత్‌ సర్టిఫికెట్‌ కూడా న్యాయవాది సంపాదించారు. 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టిన సిల్లీ సోల్స్‌ వంటి టాప్‌ రెస్టారెంట్‌కు, ఈ చనిపోయిన వ్యక్తికి ఏం సంబంధమో తెలుసుకోవాలని ఆయన అంటున్నారు. గోవాలో ప్రపంచ స్థాయి రెస్టారెంట్ పెట్టినట్లుగా ఇరానీ కుమార్తె మీడియాకు ఘనమైన ఇంటర్యూలు ఇచ్చారు. దానికి అడ్డదారిలో లైసెన్సులు ఎందుకు తీసుకున్నారని లాయర్ ప్రశ్నిస్తున్నారు. 


స్మృతి ఇరానీ ఇల్లీగల్ బార్ వ్యవహారం బయటకు రావడంతో కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట  అని తక్షణం  ఆమెను పదవి నుంచి దించేయాలని ప్రధానని డిమాండ్ చేసింది.