Sitaram Yechury Death: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ గురువారం చనిపోయారు. అయితే, అందరిలా సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అంత్యక్రియలు చేయడం లేదని సీపీఎం ప్రకటించింది. ఆయన కోరిక మేరకు ఆయన దేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించనున్నట్లుగా ప్రకటించింది. 


ఎయిమ్స్ ప్రకటన


అంతేకాక, ఎయిమ్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సీతారాం ఏచూరి (72) నిమోనియాతో ఆగస్టు 19న ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. సెప్టెంబరు 12 సాయంత్రం 3.05 గంటలకు చనిపోయారు. డెడ్ బాడీని ఆయన ఫ్యామిలీ ఢిల్లీలోని ఎయిమ్స్‌కు అప్పగించింది. టీచింగ్ అండ్ రీసెర్చ్ కోసం ఈ డెడ్ బాడీ ఉపయోగపడుతుంది’’ అని ఎయిమ్స్ ఆస్పత్రి ప్రకటించింది.


Also Read: వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత


ప్రస్తుతానికి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని మార్చురీలో సీతారాం ఏచూరి పార్థివ దేహం ఉన్నట్లుగా సీపీఎం వర్గాలు వెల్లడించాయి. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని వసంత్ కుంజులో గల నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏచూరీ పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అదే సమయంలో ప్రముఖులు నివాళులు అర్పించేందుకు వీలు కల్పించనున్నారు. తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్‌కు సీతారాం ఏచూరి పార్థివ దేహం అప్పగించనున్నారు.


డెడ్ బాడీ కూడా దేశానికి ఉపయోగపడేలా - బీవీ రాఘవులు
ఈ విషయంపై సీపీఎం నేత బీవీ రాఘవులు మాట్లాడారు. సీతారాం ఏచూరి రాజకీయాల్లో రావడమే కుటుంబాన్ని త్యాగం చేసి వచ్చారని అన్నారు. ‘‘అందుకని తన పార్థివ దేహం కూడా దేశానికి, ప్రజలకు ఉపయోగపడాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి, తన పార్థివ దేహం కూడా ప్రయోగాల కోసం ఉపయోగపడాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పుడూ ఉండేది. అందుకే ఆయన మరణానంతరం దేహాన్ని ఆస్పత్రికి ఇవ్వనున్నారు. ఆయన ఏ ఆస్పత్రిలో చనిపోయారో అదే ఆస్పత్రిలోని మెడికల్ కాలేజీకి తన పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు’’ అని బీవీ రాఘవులు వెల్లడించారు.


Also Read: స్టూడెంట్ లీడర్ నుంచి జనరల్ సెక్రటరీ వరకు, ఇది సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం


రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్ధాలుగా  జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్య సభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.