Assamese Actress Arrested In Online Trading Scam: దాదాపు రూ.2 వేల కోట్ల ఆన్ లైన్ ట్రేడింగ్ స్కాంకు (Online Trading Scam) సంబంధించి గురువారం ఓ అస్సాం నటితో (Assam Actress) పాటు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరాకు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు తాజాగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా, అస్సాం పోలీసులు ఇటీవలే రూ.2 వేల కోట్ల కుంభకోణం గుట్టు రట్టు చేశారు. పెట్టుబడిని రెట్టింపు చేస్తామని.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరిట ప్రజల నుంచి మోసగాళ్లు సొమ్మును సమీకరించారు. ఈ కేసులో ఇప్పటికే విశాల్ పుకాన్‌ను అరెస్ట్ చేశారు. పెట్టుబడులపై 60 రోజుల్లో 30 శాతం రాబడి వస్తుందని విశాల్ నమ్మబలికాడు. 4 నకిలీ సంస్థలను స్థాపించి.. అస్సాం చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి పలు ఆస్తుల్ని కూడబెట్టాడు.
ఈ కుంభకోణంలో బోరా దంపతులతో పాటు మరికొందరిపైనా ఆరోపణలు రాగా.. విశాల్ పుకాన్‌ను అరెస్ట్ చేసి వీరిని పోలీసులు విచారణకు పిలిచారు. అయితే, వీరు హాజరుకాకపోవడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి తాజాగా అరెస్ట్ చేశారు.
నటి వీడియో సందేశం
ఈ క్రమంలో నటి బుధవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 'నాది, నా కుటుంబం పరువుకు నష్టం కలిగించేలా వార్తలు వస్తోన్న నేపథ్యంలో నేను పోలీసుల ముందు లొంగిపోవాలని విచారణకు సహకరించాలని నిర్ణయించుకున్నాను. నేను ఎక్కడికీ పారిపోలేదు. మీడియాలో వస్తోన్న కథనాలతో మాకు ఎదురైన వేధింపుల వల్ల మేం అన్నింటికీ దూరంగా ఉన్నాం. ఆ వార్తల్లో 10 శాతం కూడా వాస్తవం లేదు.' అని అందులో పేర్కొన్నారు. బుధవారం ఆమె వీడియో విడుదల చేయగా.. గురువారం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తొలుత ఈ స్కాం విలువ మొత్తం రూ.22 వేల కోట్లు అని రాగా.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.2 వేల కోట్లుగా పేర్కొన్నాయి.
Also Read: Delhi News: ఢిల్లీలో రోడ్లపై నడవడం అంత ప్రమాదకరమా? రాత్రి 9 నుంచి 2 గంటల వరకు అసలు బయటకు రావద్దా?