కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమర్పించిన నివేదికలో కీలక అంశాలు వెలుగు చూశాయి. పార్టీలోని సీనియర్లు ఎన్నికల్లో నిలబడి గెలిచే పరిస్థితి లేదని ప్రధానంగా పీకే ప్రస్తావించారు. పార్టీని నడుపుతున్న వారిలో అత్యధిక మంది నామినేట్ అయిన వారేనని.. వారికి ప్రజలతో సంబంధం ఉండదని.. ఎన్నికల్లో పోటీ చేయలేరని పేర్కొన్నారు.  ఇలాంటి సమస్యలను పరిష్కరించుకుని దేశం మొత్తం రీచ్ అయ్యేలా ఓ ప్రచార అస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. అధికారాన్ని సాధించాలంటే 45 శాతం ఓట్లు ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నారు. 30 కోట్ల మంది కాంగ్రెస్‌కు ఓటు వేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. 


కొత్త నాయకుల్ని సిద్ధం చేసుకోవాలి ! 


ప్రస్తుత డిజిటల్ యుగంలో కాంగ్రెస్ నేతల కంటే ఎక్కువగా బీజేపీ నేతలకు .. ఆయా విషయాలపై.. రాజకీయాలను డిజిటల్‌తో అనుసంధానం చేసుకుని ఉపయోగిచడంపై ఎక్కువ అవగాహన ఉందన్నారు. " ఇండియా డిసర్వ్ బెటర్ " భారత్ మరింత మెరుగ్గా ఉండాలి అన్న నినాదంతో రాజకీయాలకు సంబంధం లేదని తటస్థుల్ని ఆకట్టుకోవాలని పీకే తన నివేదికలో కాంగ్రెస్‌ హకమాండ్‌కు సూచించారు.  కాంగ్రెస్ పునర్జన్మ పొందాలంటే.. ఆత్మను కాపాడుకుని కొత్త శరీరాన్ని పెంపొందించుకోవాలన్నారు. అంటే.. కాంగ్రెస్ సిద్ధాంతాలను కొనసాగిస్తూ కొత్త నేతలను పెంచుకోవాలని పీకే చెప్పినట్లయింది. 


గాంధీయేతర వైస్ ప్రెసిడెంట్‌ ఉండాలి !


కాంగ్రెస్ పునర్జన్మకు నటరాజ కాన్సెప్ట్‌ను తన నివేదికలో పీకే వివరించారు.  నటరాజ సృష్టి, రక్షణ, విముక్తి, విధ్వంసం, అనుసంధానం వంటి అంశాల నుండి ప్రేరణ పొంది ప్రజలకు నచ్చే రాజకీయ వేదికగా పని చేసే కొత్త కాంగ్రెస్ తయారవ్వాలని పీకే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో  ఉన్న నిర్లక్ష్య వైఖరి, జవాబుదారీతనం లేకపోవడం, సానుభూతిని వైఖరిని తొలగించాలని స్పష్టం చేశారు.  కాంగ్రెస్ నాయకత్వం లక్ష్యాలు, వ్యూహం, సాంకేతికత, విధానం ముందుకు వెళ్లే మార్గంలో పూర్తిగా ఏకీకృతంగా కనిపించడం లేదని.. ఫలితంగా పూర్తిగా స్పష్టత  లేకపోవడం, కొన్నిసార్లు గందరగోళం మరియు ప్రతిష్టంభన ఏర్పడుతుందని గుర్తు చేశారు. 


ఏపీలో వైఎస్ఆర్‌సీపీతో పొత్తు పెట్టుకోవాలి ! 


కాంగ్రెస్ నాయకత్వం నిర్దేశించిన విధంగా విజయవంతంగా పనిచేయగల గాంధీయేతర వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్ నియమించాలని ప్రశాంత్ కిషోర్ సూచించారు.  5-6 రాజకీయపార్టీలతో కూడిన కూటమిని ఏర్పాటు చేయాలన్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, తమిళనాడులో డీఎంకే, జార్ఖండ్‌లో జేఎంఎం, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్, బెంగాల్‌లో టీఎంసీతో కలిసి పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తే 75-80 శాతం లోక్‌సభ సీట్లలో గట్టిపోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని పీకే తన నివేదికలో వెల్లడించారు. 


కోటి మంది కాంగ్రెస్ సైనికుల్ని సిద్ధం చేసుకోవాలి ! 


కాంగ్రెస్ పార్టీ తక్షణం పునరుత్తేజం పొందడానికి 15,000 మంది అట్టడుగు స్థాయి నాయకులను గుర్తించాలని వారిని పార్టీ పనిలో వెంటనే నిమగ్నం చేయాలన్నారు. ఆలాగే  భారతదేశం అంతటా 1 కోటి మంది కాంగ్రెస్ సైనికులను క్రియాశీలం చేయాలని కిషోర్ సూచించారు. తటస్థుల నుంచి మద్దతు పొందడానికి ప్రస్తుత పాలకులకు వ్యతిరేకంంగా ప్రచారం చేయడానికి ఒక వేదికను సిద్దం చేసి "ఇండియా డిజర్వ్స్ బెటర్" కింద క్యాంపెయిన్ చేయాలన్నారు. 


కాంగ్రెస్ పెద్దలకు నచ్చిన పీకే రిపోర్ట్ ! 
 
పీకే ఇచ్చిన ఈ నివేదికపై  కాంగ్రెస్ కమిటీ సంతృప్తికరంగా ఉన్నట్లు సమాచారం. 85 పేజీల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పై గత కొన్ని వారాలుగా కిశోర్‌ కాంగ్రెస్ కమిటీతో చర్చలు జరపారు.  ప్రణాళికపై కమిటీలోని సీనియర్‌ నేతలు చాలావరకు సంతృప్తి వ్యక్తం చేశారని  సోనియాకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీని తిరిగి అధికారంలో తెచ్చేందుకు కిశోర్‌ వ్యూహం పని చేస్తుందన్న విశ్వాసాన్ని నివేదికలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీరి సిఫార్సుల ఆధారంగా పార్టీలో సంస్థాగత మార్పులపై సోనియా తుది నిర్ణయం  తీసుకోనున్నారు.