నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీవ్ కుమార్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 30న ఆయ‌న బాధ్యతల నుంచి పూర్తిగా వైదొలుగుతార‌ని తెలిపింది.   రాజీవ్ స్థానంలో సుమన్ కే బెరీని నూతన వైస్ చైర్మన్ గా   కేంద్ర ప్రభుత్వం నియమించింది. వచ్చే నెల 1వ తేదీన సుమన్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా పని చేస్తున్న రాజీవ్ కుమార్ పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది. కానీ ఆయన ముందే తప్పుకున్నారు. 



2017 ఆగస్టులో అప్పటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా ఉన్న అరవింద్ పనగరియా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. వ్యవసాయ రంగం, పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ త‌దిత‌ర అంశాల్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా రాజీవ్ కుమార్ కీల‌క పాత్ర పోషించారు.  కొత్తగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్  గా నియమితులైన సుమర్ బేరీ.. ఇంత‌కుముందు నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎక‌న‌మిక్ రీసెర్చ్ డైరెక్టర్ జ‌న‌రల్ గా ప‌ని చేశారు. 



సుమన్ కే బెరి  ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, స్టాటిస్టికల్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించిన సాంకేతిక సలహా కమిటీలో కూడా సభ్యుడిగా చేసిన అనుభవం ఉంది. 2013లో థింక్ ట్యాంక్ అయిన పహ్లే ఇండియా ఫౌండేషన్‌ను సుమన్ బెరీ స్థాపించారు. దీనికి 2017 వరకు ఆయన నాయకత్వం వహించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో కూడా రెండు సార్లు పనిచేశారు. 


పదవీ కాలం రోజుల్లోనే పూర్తి అయ్యే చాన్స్ ఉన్నప్పటికీ రాజీవ్ కుమార్ ఎందుకు రాజీనామా చేశారన్నది కేంద్ర ప్రభుత్వవర్గాల్లో మిస్టరీగా మారింది. గత చైర్మన్ అరవింద్ పనగరియా కూడా మందుగానే వైదొలిగారు. పనగరియా రెండేళ్ల పాటు బాధ్యతల్లో ఉన్నారు.