బెంగాల్ రాజధానిలోని హౌరా బ్రిడ్జి దేశంలోనే ప్రత్యేకమైనది.  అయితే దూరం నుంచి చూస్తేనే ఆ ప్రత్యేకత. దగ్గరకు వెళ్తే మాత్రం గుట్కా కంపే. ఆ  బ్రిడ్జి మొత్తాన్ని  స్పిట్టింగ్ జోన్‌గా మార్చేసుకున్నారు గుట్కా రాయుళ్లు. ఆ ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఎలా అరికట్టాలో తెలియక బెంగాల్ అధికారులు కూడా పట్టించుకోవడం మానేశారు. అయితే చత్తీస్‌ఘడ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ బ్రిడ్జి దుస్థితిని చూసి చలించిపోయాడు.  వెంటనే ట్వీట్ చేశారు. తన ట్వీట్‌ను షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్‌లకు ట్యాగ్ చేశాడు. 






ఈ నలుగురు బాలీవుడ్ స్టార్లు పాన్ మసాలా, మౌత్ ఫ్రెషనర్ల పేరుతో గుట్కాలను ప్రమోట్ చేస్తూంటారు. సరోగేట్ అడ్వార్టయిజింగ్ ద్వారా కోట్లు ఆర్జిస్తూంటారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ పాన్ మసాలా ప్రొడక్ట్‌ ప్రకటనలో నటించారు.  పాన్‌ మసాలాలో పొగాకు ఉంటుందని, ఇది ప్రజలను వ్యసపరులుగా మారుస్తుందన్న విమర్శలు వచ్చాయి.  పాన్.. కేన్సర్ కారకంగా పనిచేస్తోందని, తమలపాకులోని పదార్థాలు శరీరంలో కేన్సర్ కారకాలుగా మారి నోటి కేన్సర్‌కు దారితీస్తాయని తేలిందని పేర్కొంటూ పాన్ మసాలాలను ప్రోత్సహించే ప్రకటనలకు స్వస్తి చెప్పాల‌ని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ అమితాబ్‌ని కోరింది.  దీంతో అమితాబ్ ఆ ప్రకటన నుంచి విరమించుకుంటున్నట్లుగా ప్రకటించారు. 


  ఇటీవల బాలీవుడ్‌ స్టార్స్‌ అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్ కుమార్, షారుక్‌ ఖాన్‌ పాన్‌ మసాలా యాడ్‌లో కలిసి నటించారు. ఇది పెద్ద దుమారాన్నే రేపింది. జనాలకు హని చేసే ఎటువంటి ప్రాడెక్ట్స్ ను తాను ప్రమోట్ చేయనని గతంలో చెప్పారు అక్షయ్ కుమార్.  ముఖ్యంగా   జనాల ప్రాణాలతో ఆటలు ఆడే  టోబ్యాకో ఉత్పత్తులను తాను ఎకరేజ్ చేయనన్నారు. గుట్కా, మందు వంటి వాటికి తానెప్పుడూ అడ్వర్‌టైజ్‌ చేయనని అక్షయ్‌ గతంలో చెప్పాడు.అయితే పాన్‌ మసాలా యాడ్‌లో  కనిపించడాన్ని నెటిజన్లు తప్పు పట్టారు. దీంతో మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పి  పాన్ మసాలా ప్రమోషన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. 





తెలుగులో మహేష్ బాబు కూడా ఓ పాన్ మసాలా ప్రకటనలో నటించారు. అది కూడా వివాదాస్పదమయింది. అయితే ఆయన తన ప్రకటనను వెనక్కి తీసుకోలేదు.