ఇప్పటికే పెరిగితున్న నిత్యవసరాల ధరలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏది ముట్టుకున్నా షాక్‌ కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా సామాన్యుడికి మరో షాక్ తగలనుంది. మరోసారి వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. 


ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండోనేషియా ఏప్రిల్ 28 నుంచి ఎగుమతులను నిషేధించనుంది. దీని వల్ల ప్రధానంగా భారత్‌ తీవ్రంగా ఇబ్బంది పడనుంది. దేశీయంగా ఇప్పటికే ఆహార, చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ నిషేధంతో అది మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. 


ఇండోనేషియా అధిక ధరలు, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతోంది. దేశీయంగా కొరత రాకుండా ఉండేందుకు తగిన నిల్వలు తమ దేశంలో ఉంచుకునేందుకు ఎగుమతులను నిషేధించింది. ఇది ఇతర దేశాలపై ప్రభావం చూపనుంది.  


ఇండోనేషియా నుంచే పామాయిల్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా, భారతదేశం మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ పామాయిల్‌ను వంట నూనెలుగా ఉపయోగిస్తున్నారు. సౌందర్య సాధనాలు, జీవ ఇంధనాల ఉత్పత్తుల్లో కూడా వాడుతున్నారు. బిస్కెట్లు, లాండ్రీ డిటర్జెంట్లు, చాక్లెట్ వంటి అనేక ఉత్పత్తుల తయారీలో కూడా యూజ్ చేస్తున్నారు. 


ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. అక్కడ నుంచి వచ్చే సన్‌ఫ్లవర్ ఆయిల్ రాక తగ్గిపోవడంతో ఈ సమస్య ఎదురైంది. ఇప్పుడిప్పుడే కాస్త కుదట పడుతున్న పరిస్థితుల్లో ఇండోనేషియా పిడుగు పడనుంది. 


ప్రపంచవ్యాప్తంగా పొద్దుతిరుగుడు నూనె ఎగుమతుల్లో బ్లాక్‌ సీన్‌ 76% వాటా కలిగి ఉంది. ఇండోనేషియా నుంచి సరఫరా నిలిచిపోవడం వల్ల భారతదేశానికి ప్రతి నెలా దాదాపు 4 మిలియన్ టన్నుల పామాయిల్ దిగుమతి ఆగిపోనుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత దేశానికి వచ్చే పొద్దుతిరుగుడు నూనె సరఫరా నెలకు దాదాపు 100,000 టన్నులకు తగ్గిపోయింది. ఇప్పుడ ఇండోనేషియా నుంచి కూడా ఎగుమతి ఆగిపోతే పరిస్థితి మరింత దిగజార్చుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


ఉక్రెయిన్‌, రష్యా యుద్దం కారణంగా నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో భారతదేశం టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరుకుంది. మార్చిలో నాలుగు నెలల గరిష్ట స్థాయిలో రికార్డు అయింది.  ఫిబ్రవరిలో 13.11%గా ఉన్న టోకు ధరల సూచీ మార్చిలో 14.55% పెరిగింది.


ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కచ్చితంగా చర్చలు జరిపి ఇండోనేషియా నుంచి దిగుమతి ఆగిపోకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం తాత్సారం చేసిన ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.