Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. భద్రతా దళాలు స్పందించి ఎదురు కాల్పులు చేశాయి. కానీ ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు అధికారులు వీరమరణం చెందారు. ఈ ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ హుమాయున్ భట్ లు అమరులయ్యారు. మన్‌ప్రీత్ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్ కు చెందిన వారిగా గుర్తించారు. ఉగ్రవాదులు దాక్కున్న అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ తహసీల్ లోని గాడోల్ ప్రాంతంలో బుధవారం ఉదయం కాల్పులు జరిగాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.
లష్కరే తోయిబాకు చెందిన షాడో గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాజౌరిలోని నార్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో భద్రతా సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఎన్ కౌంటర్ బుధవారం వరకు కొనసాగింది. అధికారులు, భద్రతా బలగాల పాకిస్థానీ గుర్తులతో ఉన్న మందులను, యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను గుర్తించారని డిఫెన్స్ పీఆర్వో, లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్త్వాల్ తెలిపారు. సెప్టెంబర్ 12వ తేదీన భద్రతా దళాలు ఆ ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. రెండో ఉగ్రవాదిని సెప్టెంబర్ 13వ తేదీన హతమార్చాయి భద్రతా బలగాలు.