Seema Haider: ప్రేమించిన వాడితోనే కలకాలం కలిసి జీవించాలనుకుని పిల్లలతో సహా దేశం సరిహద్దులు దాటి పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఆమె రా ఏజెంట్ గా దర్శనం ఇవ్వబోతుందని సమాచారం. సినిమా దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్ మంగళవారం రోజు గ్రేటర్ నోయిడాలో సచిన్ తో కలిసి ఉంటున్న సీమా హైదర్ ను కలిశారు. జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ బృందం సీమాకు ఆడిషన్స్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఉదయపూర్ టైలర్ కన్హయ్య లాల్‌ను ఇస్లామిక్ రాడికల్స్ హత్య చేసిన కేసు ఆధారంగా ఈ సినిమా తీయబోతున్నారు. ఈ సినిమా పేరు 'ఎ టైలర్ మర్డర్ స్టోరీ'. ఈ సినిమా కోసమే సీమా హైదర్ ను రా ఏజెంట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న సీమా హైదర్ ఈ సినిమాలో రా ఆఫీసర్‌గా నటించబోతోంది.


వారి సమస్యలు చూసే సినిమాలో ఛాన్సిచ్చారా..? 


సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనా ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో కొత్త ఇంటికి మారిన తర్వాత వారు ఎదుర్కొన్న ఇబ్బందులను వీడియో రూపంలో విడుదల చేశారు. ఈక్రమంలోనే వారు తినేందుకు తిండి కూడా లేకుండా పడుతున్న అవస్థల గురించి వివరించారు. అయితే ఆ విషయం గుర్తించిన దర్శకులు.. వారి సమస్యలు తీర్చేందుకే సినిమాలో అవకాశం ఇచ్చినట్లు దంపతులు చెబుతున్నారు. 


అసలేం జరిగిందంటే..?


కరోనా సమయంలో పబ్ జీ ఆడుతున్నప్పుడు గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తున్న 22 ఏళ్ల భారతీయ వ్యక్తి సచిన్ మీనాతో తాను ప్రేమలో పడ్డానని 30 ఏళ్ల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ చెప్పారు. ఇప్పటికే గులాం హైదర్‌తో వివాహమై నలుగురు పిల్లలతో ఉన్న సీమా.. సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్‌ను విడిచి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది. ఆమె మొదట మార్చిలో నేపాల్‌లో సచిన్‌ను కలుసుకుంది. ఆ తర్వాత ఆమె హిందూ మతంలోకి మారిన తర్వాత హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మే 13న ఆమె పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించారు. జులై 4వ తేదీన సీమా భారత దేశంలోకి చొరబడినందుకు ఆమె అరెస్టు కూడా చేశారు. అలాగే ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్, అతని తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కొన్ని రోజుల తర్వాత సీమా, సచిన్, అతడి తండ్రి బెయిల్‌పై విడుదలైనప్పటికీ.. ఈ జంటను దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఆమె నిజంగానే ప్రేమ కోసమే దేశం దాటిందా లేక ఆమె రా ఏజెంటా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగానే సౌదీ అరేబియాలో పని చేస్తున్న సీమా మాజా భర్త గులామ్ తన భార్య, పిల్లలను తిరిగి పాకిస్థాన్ పంపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే తనకు పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని, సచిన్‌తో కలిసి జీవించాలనుకుంటున్నట్లు సీమా చెప్పింది. ప్రస్తుతం ఇక్కడే కలిసి ఉంటున్నారు.