SCO Summit 2025 In China | టియాంజిన్: చైనా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని కోరారు. షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మిట్ సందర్భంగా జరిగిన సమావేశంలో, ప్రధాని మోదీ మాట్లాడుతూ, "ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఘర్షణ గురించి నిరంతరం రష్యాతో చర్చిస్తున్నాము. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం. అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని భారత్ ఆశిస్తుంది. వీలైనంత త్వరగా ఈ ఘర్షణను ముగించడానికి ఒక మార్గాన్ని వెతకండి. సాధ్యమైనంత త్వరగా శాశ్వత శాంతిని నెలకొల్పాలి. ఇది మొత్తం మానవాళికి మంచిది" అని ప్రధాని మోదీ అన్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్, రష్యాలు ఎల్లప్పుడూ చేయి చేయి కలిపి నిలబడ్డాయని ప్రధాని మోదీ అన్నారు. "రెండు దేశాల ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం మా మధ్య సన్నిహిత సహకారం చాలా ముఖ్యం" అని అన్నారు.

మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది: మోదీతో పుతిన్

భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని పుతిన్ అన్నారు. "SCO గ్లోబల్ సౌత్, తూర్పు దేశాలను ఏకం చేయడానికి ఇది వేదికగా మారుతుంది. డిసెంబర్ 21, 2025న భారతదేశం-రష్యా సంబంధాలను 'ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి ఎలివేట్ చేసిన 15వ వార్షికోత్సవం ఉందని చెప్పడానికి హ్యాపీగా ఉందన్నారు. నేటి మా సమావేశం భారత్, రష్యా మధ్య సంబంధాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. రష్యా, భారతదేశం ఎప్పటినుంచో పరస్పర సహకారం అందించుకుంటున్నాయని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తామని" రష్యా అధినేత పుతిన్ అన్నారు.

ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్..

చైనాలోని టియాంజిన్‌లో సోమవారం జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ తర్వాత నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే కారులో ప్రయాణించిన అరుదైన ఘటన జరిగింది. అమెరికా అదనపు టారిఫ్ విధించినా ఇరు దేశాలు వారి ద్వైపాక్షిక సమావేశానికి ప్రాధాన్యత ఇచ్చారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్న కారణంగా అమెరికా భారత్ మీద 25 శాతం అదనపు సుంకాలు విధించింది. ఒకవేళ రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయడం నిలిపివేస్తే కనుక 25 శాతం అడిషనల్ టారిఫ్ తొలగించడంతో పాటు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.