టియాంజిన్: షాంఘై సహకార సంస్థ (SCO Summit) 25వ శిఖరాగ్ర సదస్సు ఆదివారం రాత్రి చైనాలోని టియాంజిన్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, నేపాల్ ప్రధాని కేపీ ఓలీ, తజకిస్తాన్ అధ్యక్షుడు ఇమోమాలి రహమాన్‌, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, తదితరులు హాజరయ్యారు. 

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఇచ్చిన విందుతో షాంఘై సహకార సంస్థ సదస్సుకు శ్రీకారం చుట్టినట్లయింది. ఈ విందుకు పలు దేశాల అధినేతలు హాజరై గ్రూప్ ఫొటో దిగారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలు దేశాల అధినేతలు దిగిన గ్రూప్ ఫొటో వైరల్ అవుతోంది. ట్రంప్ టారిఫ్ లతో ఈ సమావేశంలో చైనా, భారత్, రష్యా అధినేతలు ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తారా, నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతోంది.

ఆ ముగ్గురు.. ఓ పవర్‌ఫుల్ ఫొటో

SCO సభ్యదేశాల మధ్య ఐక్యతను, సహకారాన్ని పెంచి ప్రపంచంలో పెద్దపాత్ర పోషించడంలో ఈ సదస్సు ఉపయోగపడుతుందని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. షాంఘై సహకార సదస్సుకు 20 మంది విదేశీ నేతలు, 10 అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లను ఆహ్వానించారు. నేడు (సోమవారం) ఆ దేశాధినేతలు కీలకంగా సమావేశం కానున్నారు. ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ లతో కలిసి మోదీ దిగిన ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎవరిలోనో భయం మొదలైందని కామెంట్లు వస్తున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్ ల సమయంలో చైనాలోని టియాంజిన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. రెండు రోజులపాటు జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం ప్రారంభానికి ముందు, ప్రధాని మోదీ పలు దేశాల ప్రముఖులను కలిశారు. పలు దేశాల అధినేతలను అందరినీ కలిసిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అందించారు.

 

ప్రధాని మోదీ Xలో పోస్ట్ చేస్తూ, టియాంజిన్‌లో జరిగిన SCO సమావేశం సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జును కలిశానని పోస్ట్ చేశారు. భారతదేశం, మాల్దీవుల మధ్య అభివృద్ధి పనులలో సహకారం ఉంటుందని, ఇది రెండు దేశాల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మాల్దీవుల ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి భారతదేశం ఈ సహకారం అందిస్తుందన్నారు. 

నేపాల్ ప్రధాని కేపీ ఓలీని కలవడం ఆనందంగా ఉందిటియాంజిన్‌లో నేపాల్ ప్రధాని కేపీ ఓలీని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం, నేపాల్‌ల మధ్య సంబంధాలు చాలా పాతవి, ప్రత్యేకమైనవి అన్నారు. SCO సమ్మిట్‌లో నరేంద్ర మోదీ కూడా ఈజిప్ట్ ప్రధాని ముస్తఫా మడ్‌బౌలీని కలిశారు. కొన్ని సంవత్సరాల కిందట తాను చేసిన ఈజిప్ట్ పర్యటనను గుర్తుచేసుకున్నారు. భారత్-ఈజిప్ట్ స్నేహం అభివృద్ధిలో కొత్త శిఖరాలను తాకుతోందని మోదీ అన్నారు.

బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకోను కలిశానని, చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ Xలో పోస్ట్ చేశారు. రెండు దేశాలకు రాబోయే అవకాశాలపై మేమిద్దరం ఉత్సాహంగా ఉన్నామని మోదీ పేర్కొన్నారు.

'భారత్, తజికిస్థాన్ సంబంధాలు బలపడుతున్నాయి'భారత్, తజికిస్థాన్ సంబంధాలు బలపడుతున్నాయని మోదీ అన్నారు. అధ్యక్షుడు ఇమోమాలి రహమాన్‌ను టియాంజిన్లో కలుసుకున్నాను. భారతదేశ వాణిజ్యం, సంస్కృతి సంబంధాలు పెరుగుతున్నాయి. కజకిస్థాన్ అధ్యక్షుడు టోకయేవ్తో అభిప్రాయాలను షేర్ చేసుకున్నానని  ప్రధాని మోదీ Xలో పోస్ట్ చేశారు. రెండు దేశాలు ఎనర్జీ భద్రత, ఆరోగ్యం, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో కలిసి పనిచేస్తున్నాయని తెలిసిందే.