Kuja Dosha Verdict: మాంగళిక(కుజదోషం) ఉందో లేదో నిర్ధారించేందుకు అత్యాచార బాధితురాలి జాతకాన్ని కోరుతూ అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆర్డర్స్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సమయంలో ఈ అంశాన్ని విచారించింది. అత్యాచార బాధితురాలి జాతకాన్ని పరిశీలించి తనకు కుజదోషం ఉందో లేదో చెప్పాలని లక్నో యూనివర్సిటీలోని జ్యోతిషశాస్త్ర విభాగం అధిపతిని అలహాబాగ్ హైకోర్టు మే 23న ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ పంకజ్ మిథాల్ లతో కూడిన సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ముందు సమర్పించారు. జస్టిస్ బ్రిజ్ రాజ్ సింగ్ తో కూడిన అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ వాదించారు. సొలిసిటర్ జనరల్ లేవనెత్తిన అంశాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. మధ్యాహ్నం 3 గంటలకు విచారించింది.


'జ్యోతిష్యం జోలికి పోవట్లేదు, అసలు విషయంపైనే మా ఫోకస్'


అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అసంబద్ధంగా ఉన్నాయని, బాధితురాలి గోప్యతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. ఈ అంశంలో జ్యోతిష శాస్త్రం వాస్తవాన్ని చెప్పగలదా? లేదా? అనే విషయంలోకి తాము వెళ్లదలచుకోలేదని, కేవలం ఈ అంశంతో ముడిపడి ఉన్న విషయాలపైనే తాము దృష్టి సారిస్తామని విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ధూలియా వ్యాఖ్యానించారు. జ్యోతిష్య శాస్త్రంపై పార్టీకి ఉన్న మనోభావాలను పూర్తిగా గౌరవిస్తామని పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకునేటప్పుడు వ్యక్తిగత జ్యోతిష్య విషయాలను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో జ్యోతిష్య శాస్త్రాన్ని ఎందుకు పరిగణించాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. కుజదోషం ఉందో లేదో నిర్ధారించాలన్న అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే.. మెరిట్ ల ఆధారంగా బెయిల్ దరఖాస్తును హైకోర్టు పరిశీలించవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 


అసలేంటీ కేసు..?


ఓ వ్యక్తి, ఓ మహిళకు మాయమాటులు చెప్పి లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. కానీ ఎంతకీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసు అలహాబాద్ హైకోర్టు ముందుకు రాగా.. ఆమెకు కుజదోషం ఉందని తనను పెళ్లి చేసుకునేది లేదని నిందితులు వాదనలు వినిపించారు. బాధితురాలి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. తన క్లయింట్‌ కు కుజదోషం లేదని వాదించారు. ఇరు వైపుల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు.. ఆ మహిళకు కుజదోషం ఉందో లేదో తేల్చాలని లక్నో విశ్వవిద్యాలయ జ్యోతిష్య విభాగం అధిపతిని ఆదేశించింది. ఆ మహిళ జాతక కుండలిని పరిశీలించి పది రోజుల్లోగా కుజదోషం ఉందో లేదో తేల్చాలంది. ఇరు పార్టీల జాతకాలను సమర్పించాలని ఆదేశించింది. సదరు నివేదికను హెచ్ఓడీ ముందు హాజరు పరచాలని జస్టిస్ బ్రిజ్ రాజ్ సింగ్ తో కూడిన అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.