Odisha Train Accident : ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రాత్రి సుమారు 7 గంటల సమయంలో పట్టాలపై ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 260మందికి పైగా చనిపోగా, 900మందికి పైగా గాయపడ్డారు. భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే. కాగా ఈ ఘటనపై దేశం నలుమూలల్లో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు గాయుడిన వారికి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, నటీనటులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్లు చేశారు.


ఈ విషాద సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇతర దేశాలను నేతలను, ప్రముఖులను కూడా కదిలించాయి. పలువురు సౌత్ ప్రముఖులు ట్విట్టర్‌లోకి వెళ్లి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతులకు సంతాపం తెలియజేసి నివాళులర్పించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేశారు.


"ఒరిస్సాలో జరిగిన విషాద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం, భారీ ప్రాణనష్టం నన్ను చాలా దిగ్ర్భాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాల గురించే చింతగా ఉంది. ప్రస్తుతం క్షతగాత్రుల ప్రాణాలు కాపాడడానికి రక్తం ఎంతో అవసరం. కాబట్టి పరిసర ప్రాంతాల్లోని అభిమానులంతా దయచేసి రక్తదానానికి ముందుకు రావాలని కోరుతున్నా"నని మెగాస్టార్ చిరంజీవి కోరారు.


"రైలు ప్రమాద ఘటనతో నా హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"నంటూ నటి రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు,


"ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలిన ప్రార్థిస్తున్నాను" అని ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.


"కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు  హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్ట కాలంలో బాధితులు, వారి కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా"నని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.


రైలు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూసి షాక్ అయ్యానని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఈ కష్టకాలంలో ఉన్న కుటుంబాలు, వారి ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక కన్నడ నటుడు యశ్ కూడా విచారం వ్యక్తం చేస్తూ ట్విట్ చేశారు. ఒడిశా రైలు దుర్ఘటన ఎంత హృదయ విదారకంగా ఉందో మాటల్లో చెప్పడం కష్టమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన వారికి కృతజ్ఞతలు" అని ఆయన రాసుకొచ్చారు. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ కథానాయిక ఈషా రెబ్బా, హిందీ హీరోయిన్ కాజోల్ తదితరులు తమ హృదయం ముక్కలైందని, ఈ విషాదం తమ మనసులను కలచి వేసిందని పేర్కొన్నారు.   


Read Also : Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?