Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తీవ్ర విషాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైల్వే భద్రతపై ప్రశ్నలు సంధించారు. ఒడిశాలో రైలు ప్రమాదంలో 288 మంది చనిపోయారు. మరో 800 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర విపత్తుపై సంతాపం వ్యక్తం చేస్తూ, ప్రమాదానికి దారితీసిన రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. 



రైల్వే మంత్రి రాజీనామా చేయాలని టీఎంసీ డిమాండ్


ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు రైళ్లలో యాంటీ కొలిషన్ పరికరాలను అమర్చడంపై నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టేందుకు సాఫ్ట్‌వేర్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నట్లు, రైల్వే స్టేషన్ల నిర్మాణాల గురించి గొప్పలు చెప్పుకుంటూ  రైల్వే భద్రత గాలికొదిలేసిందని విమర్శించారు. 






భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కాంగ్రెస్


రైలు నెట్ వర్క్ పనితీరులో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం భయంకరమైనదని, తీవ్ర వేదన కలిగించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. 






కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. సహాయ చర్యలకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని పార్టీ కార్యకర్తలను, నాయకులను కోరారు.






రైల్వే భద్రతా వ్యవస్థపై సీపీఐ ప్రశ్నలు


రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే సిగ్నలింగ్, భద్రతా వ్యవస్థలపై సీపీఐ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ప్రశ్నలు సంధించారు. ఈ ప్రమాదంపై ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు. 






రైల్వే మంత్రి రాజీనామా చేయాలని శివసేన డిమాండ్


ఒడిశా ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలని శివసేన(ఉద్దవ్ ఠాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యంతో కూడిన భద్రతా వైఫల్యమని అన్నారు.