Sanatan Dharma Row: 


సుప్రీంకోర్టులో పిటిషన్ 


సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై ఇప్పటికే FIR నమోదైంది. ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ...DMK ఎంపీ రాజాపైనా కేసు నమోదైంది. ఇప్పుడీ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. సనాతన ధర్మంపై ఈ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెన్నైలోని ఓ లాయర్ ఈ పిటిషన్ వేశారు. వీరిపై FIR నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. DMK నేతలు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. హిందూధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్లకు బయట నుంచి ఏమైనా నిధులు వస్తున్నాయా అన్న కోణంలోనూ విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు లాయర్. LTTEతోనూ వీళ్లకు సంబంధాలు ఉన్నాయేమో అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపైనా CBI విచారణ అవసరమని పిటిషన్‌లో ప్రస్తావించారు. వీలైనంత త్వరగా ఈ పిటిషన్‌ని విచారించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ ప్రత్యేకంగా కోరారు పిటిషనర్. అయితే..దీనిపై CJI చంద్రచూడ్ స్పందించారు. ప్రొసీజర్ ప్రకారమే పిటిషన్‌ల విచారణ చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా పెద్ద దుమారం రేగుతోంది. I.N.D.I.A కూటమిలోనూ ఈ వ్యాఖ్యలు విభేదాలకు దారి తీశాయి. ఈ విషయంలో ఒక్కో పార్టీ ఒక్కో విధంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఖండించింది. 


బీజేపీ నేతలు వరుస పెట్టి కౌంటర్‌లు ఇస్తూనే ఉన్నారు. అయినా...ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు. పైగా పదేపదే ఇంకా కవ్విస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈసారి డైరెక్ట్‌గా బీజేపీనే టార్గెట్ చేశారు. బీజేపీ ఓ విషసర్పం అని మండి పడ్డారు. DMK ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లికి వెళ్లిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షమైన AIDMKపైనా విమర్శలు చేశారు. AIDMK పార్టీ చెత్తలాంటిదైతే...అందులోని పాము బీజేపీ అని సెటైర్లు వేశారు. ఇప్పటికే డీఎమ్‌కే ఎంపీ ఎ. రాజా ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీయే విషసర్పం అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ బీజేపీని విషసర్పంతో పోల్చారు. 


"ఓ విషసర్పం మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కేవలం దాన్ని పట్టుకుని బయటకు వదలడం మంచిది కాదు. మళ్లీ అది ఏదో ఓ మూల నుంచి ఇంట్లోకి వచ్చి నక్కి ఉంటుంది. మీ ఇంట్లో చెత్తను శుభ్రం చేసుకోనంత వరకూ అది అక్కడే ఉంటుంది. ఇదే ఉదాహరణను తమిళనాడు పరిస్థితులతో పోల్చి చెబుతున్నాను. తమిళనాడు మన ఇల్లు లాంటిది. ఇక్కడ AIDMK చెత్త కుప్ప అయితే...బీజేపీ విషసర్పం. ఆ చెత్తను తొలగిస్తే తప్ప ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోదు. బీజేపీ నుంచి విముక్తి కలగాలంటే AIDMKనీ తుడిచి పెట్టేయాలి"


- ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు మంత్రి 


Also Read: ఒడిశాలో వణుకు పుట్టిస్తున్న స్క్రబ్ ఇన్‌ఫెక్షన్, ఆరుగురు మృతి - ప్రభుత్వం అలెర్ట్