Sanatan Dharma Row: 


మోహన్ భగవత్‌ కామెంట్స్ ప్రస్తావన..


సనాతన ధర్మం వివాదాన్ని మొదలు పెట్టిందే RSS అని మండి పడ్డారు కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా. RSS చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యల వల్లే ఇది ఇంత వరకూ వచ్చిందని అన్నారు. కొన్నాళ్ల క్రితం స్వయంగా మోహన్ భగవత్ హిందూ ధర్మంలోని కుల వివక్ష గురించి ప్రస్తావించారని, దానికి కొనసాగింపుగానే ఈ వివాదం తలెత్తిందని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతున్నా..పదేపదే బీజేపీ ఆ పార్టీనే టార్గెట్ చేస్తోంది. ఇదంతా కాంగ్రెస్‌ కుట్రేనని మండి పడుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా స్పందించక తప్పలేదు. అసలు ఇదంతా మొదలైంది RSSతోనే అని కౌంటర్‌లు వేశారు. 


"RSS చీఫ్ మోహన్ భగవత్ ఈ వివాదాన్ని మొదలు పెట్టారు. హిందూ ధర్మం పేరు చెప్పి 2వేల ఏళ్ల పాటు కొన్ని వర్గాలపై వివక్ష చూపించారని ఆయనే చెప్పారు. 15 రోజుల క్రితం ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వివక్ష ఉన్నన్ని రోజులూ రిజర్వేషన్‌లు కొనసాగాల్సిందేనని మోహన్ భగవత్ చెప్పారు"


- పవన్ ఖేరా, కాంగ్రెస్ ప్రతినిధి






హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పలు కీలక అంశాలు చర్చించినట్టు వెల్లడించారు పవన్ ఖేరా. బీజేపీ కావాలనే ట్రాప్‌ చేస్తోందని, ఆ వలలో పడొద్దని రాహుల్ గాంధీ చెప్పారట. ఇదే విషయాన్ని తెలిపారు పవన్ ఖేరా. 


ఇటీవల రిజర్వేషన్‌లపై RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా మన సమాజంలో అసమానతలు ఉన్నాయని, ఇవి ఉన్నంత కాలం రిజర్వేషన్‌లు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...అఖండ భారతం గురించి ప్రస్తుత తరం కచ్చితంగా ఆలోచిస్తుందని వెల్లడించారు. 1947లో భారత్ నుంచి విడిపోయిన వాళ్లు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని..తప్పు చేశామని తెలుసుకున్నారని పరోక్షంగా పాకిస్థాన్‌ గురించి ప్రస్తావించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం మరాఠీ రిజర్వేషన్‌లపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. 


"మనంతట మనమే కొందరిని వేరు చేసి సమాజం నుంచి వెనక్కి నెట్టేశాం. దూరం పెట్టాం. వాళ్లను కనీసం పట్టించుకోలేదు. దాదాపు 2వేల ఏళ్ల పాటు ఇదే జరిగింది. వాళ్లకు సమాన హక్కులు ఇవ్వనంత వరకూ ఇలాంటి ప్రత్యేక హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌లు అలాంటి వాటిలో ఒకటి. సమాజంలో వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్‌లు ఉండాల్సిందే. రాజ్యాంగ పరంగా ఇచ్చిన రిజర్వేషన్‌లకు RSS ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది. మనకు కనిపించకపోయినా వివక్ష అనేది మన సమాజంలో ఇప్పటికీ ఉంది. ఇలాంటి వాళ్లకు రిజర్వేషన్‌ల ద్వారానే గౌరవమివ్వాలి."


- మోహన్ భగవత్, RSS చీఫ్ 


Also Read: Third Front Alliance: కేసీఆర్ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్? అసదుద్దీన్ ఒవైసీ హింట్ ఇచ్చారా?