సద్గురు: ఇటీవల, నేను అమెరికాలోని స్టేట్ డిపార్ట్మెంట్‌కు చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడాను. నేను అతన్ని, “అసలు పాకిస్తాన్ పై మీకెందుకు ఇంత ఆసక్తి? ఆ దేశం ఏం చేస్తుందో తెలిసాక కూడా, మీరు వాళ్లకి ఇంకా మద్దతు కల్పిస్తూనే ఉంటారు, కానీ చరిత్రలో మీరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు” అని అడిగాను.


దానికి ఆయన, “సద్గురు, సమస్య ఈరోజు ఉన్న నాయకత్వంతో కాదు. 1947లో మీకు స్వాతంత్రం లభించినప్పుడు, ప్రపంచాన్ని గురించిన నిజమైన సమాచారం మావద్ద లేదు. బ్రిటిష్ వారి ద్వారా మాత్రమే మాకు సమాచారం అందేది. వాళ్ళు మాతో, "పాకిస్తాన్‌లో ఒకే మతం, ఒకే లక్ష్యం ఉండడం వల్ల అది విజయం సాధిస్తుంది. కానీ, భారతదేశంలో అనేక అంశాలు ఉండటం వల్ల దానంతటదే నాశనం అయిపోతుంది అని స్పష్టంగా తెలిపారు” అన్నాడు.


ప్రజలు మన సంక్లిష్టతను తక్కువ అంచనా వేశారు; కచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందుతోంది. భారతదేశానికి ఉన్న అందం ఏమిటంటే, ఇది సారూప్యత ఆధారంగా ఏర్పడిన దేశం కాదు. ప్రజలు దేశాన్ని ఏర్పరిచేటప్పుడు, వాళ్ళు - భాష, మతం, వర్గం లేదా జాతి పరంగా ఒకటే అయ్యుండాలి అని ఆలోచిస్తారు. వాళ్లు ఎప్పుడూ సారూప్యతే బలం అనుకుంటారు, కానీ మనం అది వాస్తవం కానక్కర్లేదని నిరూపించాము. మన దేశంలో, ఓ 50 కిలోమీటర్లు ప్రయాణించి చుస్తే, ప్రజల రూపం, భాష, వస్త్రధారణ, ఆహారం - అన్నీ భిన్నంగా ఉంటాయి.


భారతదేశపు భాషా సంపద


మన నాడీ వ్యవస్థకు ఉన్న అతి సంక్లిష్టమైన సామర్ధ్యాల్లో ఒకటి భాష. ఒక భాష పూర్తిస్థాయికి అభివృద్ది చెందాలంటే దానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు. మన దేశంలో దాదాపు 1300కి పైగా మాండలికాలు ఇంకా వాడుక భాషలున్నాయి. దీనర్థం మన మెదళ్ళు చాలా కాలం నుంచి అంత చురుగ్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం వాటిని స్తంభింపజేసే ప్రయత్నం చేస్తున్నాము


 మన భాష గురించి గర్వపడడం చాలా ముఖ్యమైన విషయమే, కానీ అది దురభిమానంగా మారకూడదు. కానీ ఈ రోజుల్లో, ప్రాదేశిక భాష పరిస్థితి అభిమానం నుంచి దురభిమానం వైపు వెళ్తోంది. మన దేశంలో అతి సంక్లిష్టమైన, అద్భుతమైన భాషలు ఎన్నో ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు, ఇంగ్లీష్ మాట్లాడడమే ఏకైక పరిష్కారం అనే స్థితికి చేరుకుంటున్నాము. ఇద్దరు దెబ్బలాడితే, మూడో వాడు లాభం పొందినట్లు, మనలో మనం ఒక అవగాహనకి రాకపోవటం వల్ల ఒక విదేశీ భాష లాభం పొందుతోంది.


అదే సమయంలో, ఇంగ్లీష్ భాష లేకుండా, మీరు ఏమి చేయలేరు, ఎందుకంటే ఈరోజు దాదాపూ ప్రతీదీ ఇంగ్లీష్ లోనే ఉంది. కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభూత్వానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, పిల్లలందరూ రెండు భాషలు చదవడం ఇంకా రాయడం కచ్చితంగా నేర్చుకోవాలి - అందులో ఒకటి కచ్చితంగా వారి మాతృభాష అయ్యుండాలి, ఇంకోటి ఇంగ్లీష్ భాష అయ్యుండాలి, ఎందుకంటే ప్రపంచంలో వ్యవహరించడానికి అది పాస్పోర్ట్ లాంటిది. అదనంగా ఇంకో రెండో మూడో భాషలు మాట్లాడడం నేర్పించాలి.


తమిళనాడు, కర్ణాటక ఇంకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో, ఎవరైతే వారి మాతృభాషల్లో చదువుకున్నారో, అలాంటి వాళ్ళు చాలా మంది వేరే రాష్ట్రానికి వెళ్ళటానికి భయపడుతున్నారు ఎందుకంటే వాళ్లు అక్కడి రాష్ట్ర భాష మాట్లాడలేరు. కాబట్టి మనం కనీసం ఐదు భాషలలో మాట్లాడగలిగితే అద్భుతంగా ఉంటుంది. అది మనుషుల ప్రతిభను పెంచడంతో పాటు, బయటి ప్రదేశాలకు వెళ్ళగలిగే సామర్ధ్యాన్ని ఇస్తుంది. అది మనల్ని మరింత ఐక్యం చేయడంతో పాటు, మనం మన సాంస్కృతిక మూలాలను కోల్పోకుండా ఉండేలా చేస్తుంది.


భారతదేశం అనేది ఒక చిత్రదర్శిని లాంటిది. ఈ చిత్రదర్శినిని ఆకర్షణీయంగా, అద్భుతంగా ఇంకా ఎటువంటి సంఘర్షణలు లేకుండా మార్చే బాధ్యత మనదే. ఈ దేశం యొక్క స్వభావం ఎప్పుడూ ఇలాగే ఉండేది, మనం దాన్ని ఇలాగే ఉంచాలి కూడా.