Mallikarjun Kharge: మణిపూర్ లో అశాంతిపై, సామాన్యుల హత్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. అసమర్థ మణిపూర్ ముఖ్యమంత్రిని బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. జులై 6న తప్పిపోయిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురికావడంపై మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మణిపూర్ లో హింసకు మహిళలను, చిన్నారులను ఆయుధాలుగా మార్చుకున్నారని, ఈశాన్య రాష్ట్రాన్ని బీజేపీ రణరంగంగా మారుస్తోందని ఆరోపించారు. 


జులై 6వ తేదీన ఇద్దరు విద్యార్థులు తప్పిపోయారు. ఆ తర్వాత వారు శవాలై కనిపించారు. వారిని అతి దారుణంగా హత్య చేయడంపై మంగళవారం రాత్రి ఇంఫాల్‌లోని సింగ్‌జమీ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందికి, స్థానికులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులపై భద్రతా సిబ్బంది లాఠీ ఛార్జీ చేశారు. టియర్ గ్యాస్ లు ప్రయోగించారు, రబ్బరు బుల్లెట్లతో కాల్చారు. ఈ ఘర్షణల్లో 45 మంది నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.


'147 రోజులుగా, మణిపూర్ ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించడానికి సమయం దొరకడం లేదు. ఈ హింసాత్మక ఘటనల్లో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్న భయానకమైన సంఘటనలు మరోసారి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి' అని మల్లికార్జున ఖర్గే ట్విట్టర్ లో పోస్టు చేశారు.


అందమైన మణిపూర్ రాష్ట్రాన్ని రణరంగంగా మారిందని, దీనికి కారణం బీజేపీయేనని ఖర్గే విమర్శించారు. మణిపూర్ లో మరింత హింస జరగకుండా ఉండటానికి అసమర్థ ముఖ్యమంత్రిని తొలగించాలని, అశాంతిని నియంత్రించడానికి అదో ముందడుగు అవుతుందని ఖర్గే అన్నారు. 


మైతీ వర్గానికి చెందిన విద్యార్థుల హత్య


జులైలో కిడ్నాపయిన ఇద్దరు విద్యార్థులను చంపేసిన ఫొటోలు.. సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మైతీ తెగకు చెందిన 17ఏళ్ల హిజామ్‌ లింతోయింగంబి, 20ఏళ్ల ఫిజామ్  హెమ్‌జిత్‌ జులై నుంచి కనిపించడం లేదు. వారు కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. అయితే... తాజాగా వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో  ప్రత్యక్షమయ్యాయి. ఇద్దరు విద్యార్థులు అటవీ ప్రాంతంలోని ఓ క్యాంపులో కూర్చుని ఉండగా... వెనక సాయుధులు నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.  సాయుధుల చేతిలో తుపాకులు కూడా ఉన్నాయి. మరో ఫొటోలో ఇద్దరు విద్యార్థులు చనిపోయి పడి ఉన్నారు. హెమ్‌జిత్‌ తల నరికేసి ఉన్నారు. వీరిద్దరినీ హత్య చేసినట్టు  ఫొటోల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అభంశుభం తెలియని విద్యార్థుల హత్య.. మణిపూర్‌లో జరిగిన, జరుగుతున్న దారుణాలు మరో నిదర్శనంగా నిలుస్తోంది. 


మైతీ వర్గానికి చెందిన ఈ విద్యార్థులను కిడ్నాప్‌ చేసి చంపేశారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోల్లో విద్యార్థిని హిజామ్‌ వైట్‌ కలర్‌ టీషర్ట్‌ వేసుకుని ఉంది... విద్యార్థి  హేమ్‌జిత్ చెక్స్‌ షర్ట్‌లో ఉన్నాడు. మరో ఫోటోలో ఇద్దరి మృతదేహాలను నేలపై పడేసినట్టు ఉంది. జూలైలో ఈ ఇద్దరూ కనిపించకుండా పోయారు. ఆ సమయంలో వారి కోసం  గాలిస్తుండగా... ఓ షాపుల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లో వీరిద్దరూ కనిపించారు. ఆ తర్వాత ఏమయ్యారన్నది తెలియలేదు. ఇప్పుడు ఆ ఇద్దరు విద్యార్థులు హత్యకు  గురికావడం మణిపూర్‌లో కలవరం రేపుతోంది. పరిస్థితి మళ్లీ ఆదుపుతప్పే పరిస్థితి ఉండటంతో... అక్కడి ప్రభుత్వం, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇద్దరు విద్యార్థులను ఎప్పుడో చంపేసి.. ఇప్పుడు ఫొటలు విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు.