Rs 2000 Exchange: ఈ ఏడాది మే 19వ తేదీన రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందే సామాన్యులకు కనిపించకుండా పోయిన 2 వేల నోట్లు ఆ తర్వాత పత్తా లేకుండా పోయాయి. 2 వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ.. ఎక్కడా వాటితో లావాదేవీలు నిర్వహించడంలేదు. మే 19వ తేదీన రిజర్వ్ బ్యాంక్ 2 వేల నోట్లను విత్‌డ్రా చేసుకున్నప్పటి నుంచి ఆగస్టు 31వ తేదీ నాటికి 2 వేల రూపాయల నోట్లు బ్యాంకులకు భారీగా చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నారు. రూ.3.32 లక్షల కోట్ల విలువైన అంటే రూ.2 వేల నోట్లలో 93 శాతం తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.


'బ్యాంకుల నుంచి అందిన డేటా ప్రకారం, ఆగస్టు 31, 2023 వరకు చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో రూ.3.32 లక్షల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు బ్యాంకుల వద్దకు చేరాయి. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం రూ.2 వేల నోట్లలో 93 శాతం తిరిగి వచ్చాయి' అని ఆర్బీఐ తెలిపింది.










ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల మొత్తం విలువ రూ.0.24 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్బీఐ తెలిపింది. చెలామణి నుంచి బ్యాంకులకు తిరిగి వచ్చిన మొత్తం రూ.2 వేల నోట్లలో సుమారు 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయని, మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ల నోట్లతో మార్చుకున్నట్లు ప్రధాన బ్యాంకుల నుంచి సమాచారం వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రూ. 2 వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉందని, అప్పటి వరకు అవి చెలామణిలోనే ఉంటాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. 


రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. బ్యాంక్‌ ఖాతాల్లోకి పింక్‌ నోట్ల డిపాజిట్ లేదా చిన్న నోట్లుగా మార్చుకోవడం 23 మే 2023 నుంచి ప్రారంభమైంది. ఇందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఆర్‌బీఐ గడువు ఇచ్చింది. అన్ని బ్యాంకుల శాఖలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో పెద్ద నోట్లను మార్చుకోవచ్చు. 2 వేల రూపాయల కరెన్సీ నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు. కాబట్టి, ఇప్పటికీ రూ. 2000 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగానే కొనసాగుతాయి. వాటిని బ్యాంక్‌ల్లో డిపాజిట్‌ చేయడంతో పాటు, అన్ని రకాల లావాదేవీల కోసం ప్రజలు ఉపయోగించవచ్చు. పెద్ద నోట్ల మార్పిడి పూర్తి ఉచితం, బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించవు.


2000 రూపాయల నోట్లను ఎందుకు ఉపసంహరించారు?


డిజిటల్ లావాదేవీలు పెరగడంతో రూ. 2000 నోట్ల వినియోగం తగ్గిందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ చెప్పారు. 2016 నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు ప్రకటన కేంద్ర ప్రభుత్వం, దేశంలో నోట్ల కొరతను పూరించడానికి అదే నెలలో కొత్తగా రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిందని చెప్పారు. వచ్చిన కొత్తలో ఈ నోట్లను విపరీతంగా వినియోగించారని, ఇప్పుడు ఆ ధోరణి తగ్గిందని వివరించారు. ఎలక్ట్రానిక్ లావాదేవీలు బాగా విస్తరించడాన్ని దృష్టిలో ఉంచుకుని, పెద్ద విలువ గల నోట్లను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటోందని, ఇకపై ఆ నోట్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.