One Nation One Election:



ప్రత్యేక కమిటీ..


ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ వేయడాన్ని సమర్థించుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇది భారత దేశానికి ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్ అని అసో సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. One Nation, One Election కి సంబంధించి బిల్‌ని ప్రవేశపెట్టేందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చినట్టూ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. కేవలం కమిటీ మాత్రమే వేశామని, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


"ప్రస్తుతానికి కమిటీ మాత్రమే ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అన్ని అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించిన తరవాతే దీనిపై పూర్తిస్థాయిలో చర్చిస్తాం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో మరో రెండు మూడు రోజుల్లో ఖరారవుతుంది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 1967వరకూ లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ విప్లవాత్మక నిర్ణయం అనే భావిస్తున్నాను."


- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి






మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా కేంద్ర నిర్ణయాన్ని సమర్థించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌తో ప్రజాధనం వృథా కాకుండా అడ్డుకోవచ్చని అన్నారు. 


"ఇది చాలా మంచి ప్రతిపాదన. దేశంలో పదేపదే ఎన్నికలు జరగడం వల్ల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా పలు చోట్ల అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు అంతరాయం కలుగుతోంది. విలువైన వనరులు వృథా అవుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం వల్ల డబ్బు వృథా కాకుండా అడ్డుకోవచ్చు"


- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం


ఇక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యవసరం అని అభిప్రాయపడ్డారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించడం మంచి ఆలోచన అని వెల్లడించారు. 


"ఎన్నికలు పదేపదే రావడం వల్ల కొత్త అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. కొత్త పాలసీలనూ ప్రవేశపెట్టడానికి వీల్లేకుండా పోతోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం అత్యవసరం. ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను"


- యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి