Kejriwal Judicial Custody Extended By The Rouse Avenue Court: ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు మరోసారి చుక్కెదురైంది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) మరోసారి పొడిగించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియగా.. అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా.. కేసు పురోగతిలో ఉందని.. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దీంతో కేజ్రీవాల్ కు కస్టడీని న్యాయస్థానం మే 20వ తేదీ వరకూ పొడిగించింది. దీంతో ఆయన మరో 14 రోజులు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. అటు, ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇవ్వాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా ఆయనకు ఊరట దక్కలేదు. మంగళవారం విచారణ సందర్భంగా ఇరువర్గాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. మధ్యంతర బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి విచారణ గురువారం లేదా వచ్చే వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






సుప్రీం కీలక వ్యాఖ్యలు


కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఇది ఓ అసాధారణ పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. ఎన్నికలు ఐదేళ్లకు ఓసారి వస్తాయి. ఓ పార్టీ అధినేతగా ఆయనకు లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.' అని అభిప్రాయపడింది. అయితే, ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈడీ.. సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని కోర్టుకు తెలిపింది. 'ఈ కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపు ఉండకూడదు. కేజ్రీవాల్ కు ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఈ కేసులో కేజ్రీవాల్ దర్యాప్తునకు సహకరించలేదు. దర్యాప్తు సంస్థ జారీ చేసిన 9 సమన్లను పట్టించుకోలేదు. అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది.' అని ఈడీ కోర్టుకు వెల్లడించింది.


'కేజ్రీవాల్ అలా చెయ్యొద్దు'


ఈడీ వాదన అనంతరం స్పందించిన ధర్మాసనం.. ఒకవేళ ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది. 'మీకు బెయిల్ ఇస్తే అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేం అనుమతించబోం. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుంది. బెయిల్ పై విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చెయ్యొద్దు.' అని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం ఎలాంటి ఫైళ్లపై సంతకాలు చేయరని.. అయితే ఆ కారణంతో లెఫ్టినెంట్ గవర్నర్ వాటిని తిరస్కరించకుండా చూడాలని కేజ్రీవాల్ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మధ్యంతర బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసింది. 


ఆలస్యంపై సుప్రీం అసహనం


అయితే, తొలుత కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ క్రమంలో దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ ముందు నాటి కేసు ఫైళ్లను సమర్పించాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. దీంతో ఈడీ వాటిని ధర్మాసనం ముందు ఉంచింది. అనంతరం బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా తీర్పు రిజర్వ్ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీ అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్ జైల్లో పెట్టారు.


Also Read: India-Maldives: 'దయచేసి మా దేశానికి రండి' - భారతీయ పర్యాటకులకు మాల్దీవుల మంత్రి విజ్ఞప్తి