India-Mladives: భారత్ - మాల్దీవులు (Maldives) దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. భారతీయ పర్యాటకులు ఎక్కువగా లక్షద్వీప్ (Laksdweep)కు వెళ్తుండడంతో  ఆ దేశ పర్యాటకం దివాళా తీసింది. దీంతో తమ దేశ ఆర్థిక వ్యవస్థకి సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ (Ibrahim Fisal) భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాల మధ్య బంధం చారిత్రకమైందని గుర్తు చేశారు. 'మనకు ఓ చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం భారత్ తో కలిసి పని చేయాలనుకుంటోంది. మేం ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. మా ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా భారతీయులకు ఘన స్వాగతం పలుకుతున్నాం. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను.' అంటూ సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.


ఇదీ జరిగింది


భారత్ లో అంతర్భాగమైన లక్షద్వీప్ దీవులను ప్రధాని మోదీ (PM Modi) ఈ ఏడాది జనవరిలో సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి పర్యాటక అద్భుతాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై మాల్దీవుల మంత్రులు భారత్ సహా ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల నేతల వ్యాఖ్యలపై భారతీయ ప్రముఖులు, నటులు, పర్యాటకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత తీరాలు, ద్వీపాల ప్రాధాన్యంపై ప్రశంసలు కురిపించారు. నెటిజన్లు సైతం మాల్దీవులకు ఇక సెలవు లక్షద్వీప్ కు వెళ్లాలని ట్వీట్స్ చేశారు. మరోవైపు, మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) భారత దళాలను వెనక్కు పంపాలని నిర్ణయించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.


ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ ప్రముఖులు సహా ఇతర పర్యాటకులు మాల్దీవులకు వెళ్లేందుకు అప్పటికే వేసిన ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. విమాన, హోటల్ బుకింగ్స్ రద్దు చేశారు. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఆ దేశానికి తాత్కాలికంగా బుకింగ్స్ నిలిపేశాయి. ఈ క్రమంలో ఆ దేశ పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడింది. అప్పటివరకూ మాల్దీవులను సందర్శిస్తున్న పర్యాటకుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే అక్కడికి వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య దాదాపు 50 శాతానికి తగ్గిపోయింది. 2024, మే 4వ తేదీ నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. ఇదే గతేడాది జనవరి - ఏప్రిల్ మధ్య ఈ సంఖ్య 73,785 గా ఉంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఈ పరిస్థితి తలెత్తిందని నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో తమ దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడేలా సహకరించాలని భారతీయులకు మాల్దీవుల మంత్రి విజ్ఞప్తి చేశారు.


Also Read: Sunita Williams: సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర వాయిదా - చివరి నిమిషంలో మిషన్ నిలిపేసిన నాసా