Sunita Williams Space Mission Called Off: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) రోదసి యాత్ర నిలిచిపోయింది. మరో వ్యోమగామితో కలిసి ఆమె వెళ్లాల్సిన రాకెట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. వీరు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ (Boeing Star Liner) వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రస్తుతానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) ఈ మిషన్ ను నిలిపేసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:04 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి రోదసీ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో మిషన్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన నాసా.. తిరిగి ఎప్పుడు చేపడతారనేది మాత్రం వెల్లడించలేదు.






అడగడుగునా అడ్డంకులు


తొలి మానవసహిత స్టార్ లైనర్ మిషన్ ను బోయింగ్ కంపెనీ.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, పలు కారణాలతో ఈ మిషన్ కు అడగడుగునా అడ్డంకులు ఎదురుకాగా.. రాకెంట్ లాంచ్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఫ్లోరిడాలోని (Florida) కేప్ కెనాకెవాల్ లో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ కు చెందిన అట్లాస్ V రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధమైన సమయంలో సరిగ్గా 90 నిమిషాల ముందు మిషన్ నిలిపేస్తున్నట్లు నాసా ప్రకటించింది. రాకెట్ లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. 'ఇవాళ్ఠి లాంచ్ ను నిలిపేస్తున్నాం. మేము ముందుగా చెప్పినట్లు మా తొలి ప్రాధాన్యత భద్రత. పూర్తిగా రెడీగా ఉన్నప్పుడ వెళ్తాం.' అని నాసా చీఫ్ బిల్ నెల్సన్ (Bill Nelson) తెలిపారు. అయితే, అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బ్యారీ బుచ్ విల్ మోర్ (Barry Butch Wilmore) సురక్షితంగా బయటకు వచ్చారు. 


ఇదే లక్ష్యం


తాజా మిషన్ లో భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో వారం పాటు బస చేయాలనేదే ప్రణాళిక. అయితే, బోయింగ్ స్టార్ లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. 2019లో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్ లైనర్ తొలి మానవరహిత యాత్ర ఐఎస్ఎస్ (ISS) ను చేరుకోలేకపోయింది. మరో యాత్రలో పారాచూట్ సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్టులో జాప్యం తలెత్తింది. స్టార్ లైనర్ తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే తొలిసారి. తాజా ప్రయోగం విజయవంతమైతే ఐఎస్ఎస్ కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అగ్రరాజ్యానికి అందుబాటులోకి వస్తుంది. కాగా, ప్రస్తుతం స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తోంది. ప్రస్తుతానికి మిషన్ ను నిలిపేసిన నాసా మళ్లీ ఎప్పుడు రోదసీ యాత్ర చేపడతారనేది మాత్రం వెల్లడించలేదు. అయితే బ్యాకప్ తేదీలు మాత్రం మే 10, 11గా ఉన్నాయి.


మిషన్ పైలట్ గా వ్యవహరించాల్సిన సునీతా విలియమ్స్ కు ఇది 3వ అంతరిక్ష యాత్ర. గతంలో 2006, 2012లో రోదసిలోకి వెళ్లిన ఆమె.. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. మునుపటి యాత్రలో తనతో పాటు భగవద్గీతను తీసుకెళ్లిన ఆమె ఈసారి తన ఇష్టదైవం గణపతి విగ్రహాన్ని తన వెంట తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. 'అంతరిక్షంలోకి వెళ్తుంటే నాకు నా పుట్టింటింకి వెళ్లినంత ఆనందంగా ఉంటుంది. నాకు విఘ్నేశ్వరుడు అంటే చాలా ఇష్టం. స్పేస్‌లోకి వెళ్లేటప్పుడు నాతో పాటు ఆయన ప్రతిమని తీసుకెళ్తాను. అంతరిక్షంలో సమోసాలు తినడమన్నా నాకెంతో ఇష్టం' అని సునీతా విలియమ్స్ వెల్లడించారు. అయితే, సాంకేతిక లోపంతో రోదసీ యాత్ర నిలిచిపోయింది.


Also Read: Third Phase Polling In Lok Sabha Elections 2024: మూడో విడతలో 93 స్థానాలకు పోలింగ్‌- అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధానమంత్రి