RJD Chief Lalu Yadav | ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాలూ తన పెద్ద కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీలో అతడికి ఏ పదవి లేదని, పార్టీ నుంచి సస్పెన్షన్ విధించినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. బాధ్యతారహిత ప్రవర్తన కారణంగా పార్టీ నుండి బహిష్కరించినట్లు ఆర్జేడీ చీఫ్ లాలు ప్రకటించారు. ఫేస్‌బుక్‌లో తేజ్ ప్రతాప్ యాదవ్ పోస్ట్ చేసిన అమ్మాయితో రిలేషన్ విషయం వైరల్ కావడంతో లాలూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో బిహార్ మంత్రిగా పనిచేసిన తేజ ప్రతాప్ యాదవ్, శనివారం నాడు తనకు ఒక యువతితో సంబంధం ఉందని చెప్పడంతో, కొన్ని సంవత్సరాల క్రితం వార్తల్లో నిలిచిన ఆయన వివాహ వివాదంం నెటిజన్లు స్పందించారు. లాలు పెద్ద కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్, తన ప్రస్తుత ప్రియురాలితో ఉన్న తన ఫోటోను ఫేస్‌బుక్ పోస్ట్‌లో షేర్ చేసుకున్నాడు.
దాంతో తేజ్ ప్రతాప్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పార్టీలో, ప్రజల్లో తమను తక్కువగా చేస్తుందని.. క్రమశిక్షణారాహిత్యంగా భావించారు లాలూ. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ పోస్ట్‌కు స్పందిస్తూ, అతడ్ని ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుండి తొలగిస్తున్నానని, ఆయనకు ఆర్జేడీలో ఎలాంటి పదవి, పాత్ర ఉండదని తెలిపారు.
“వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం అనేది సామాజిక న్యాయం కోసం మా పోరాటాన్ని బలహీనపరుస్తుంది. పెద్ద కుమారుని కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మా కుటుంబ విలువలు, సంప్రదాయాలకు తగినట్లుగా లేవు. అందువల్ల నేను తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి కుటుంబం నుండి నిషేధిస్తున్నాను. అతన్ని ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుండి బహిష్కరించాను" అని లాలు ప్రసాద్ యాదవ్ Xలో పోస్ట్ చేశారు.
“వ్యక్తిగత జీవితంలో ఏది సరైనది, ఏది తప్పు, మంచి చెడులను చెప్పడానికి బాధ్యతగా వ్యవహరించాలి. అతను అన్నింటిని దూరం చేసుకోవాలని, వ్యక్తిగత సంబంధాలను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. లోహియావాదం, సోషలిజం సందేశం ఎల్లప్పుడూ వ్యక్తిగత నైతికతను ప్రాధాన్యత ఇస్తుంది. మా కుటుంబం అదే సిద్ధాంతాలను స్వీకరించింది," అని ఆ పోస్ట్‌లో లాలూ పేర్కొన్నారు.
ఇంతకీ తేజ్ ప్రతాప్ పోస్టులో పేర్కొన్న అంశమిదే..
తేజ ప్రతాప్ తన పోస్టులో ఇలా రాసుకొచ్చాడు. "నేను తేజ ప్రతాప్ యాదవ్, ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి అనుష్క యాదవ్. మేం గత 12 సంవత్సరాలుగా రిలేషన్ కొనసాగిస్తున్నాం. మేం ప్రేమించుకుంటున్నాం. గత 12 సంవత్సరాలుగా రిలేషన్‌లో ఉన్నాం. ఈ విషయాన్ని చాలా కాలం నుంచి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అందుకే మీ అందరి ముందు వెల్లడిస్తున్నాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను," అని పోస్ట్ చేశాడు.
సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. 2018లో వైభవంగా వివాహం చేసుకుని.. ఇప్పుడు ప్రేమ అని అమ్మాయి ఫొటో పోస్ట్ చేయడం ఏంటని ఏకిపారేశారు. లాలు కుమారుడికి ఇదేం పాడుబుద్ధి అని ఎగతాళి చేశారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు అయిన అయిశ్వర్యతో తేజ ప్రతాప్ యాదవ్ వివాహం జరిగింది. పెళ్లయిన కొంత కాలానికే భర్త, అత్తామామలు తనను ఇంటి నుంచి పంపించేశారని ఆరోపిస్తూ ఐశ్వర్య పుట్టింటికి వెళ్లిపోయింది.
ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ అయిన వెంటనే, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ స్పందించాడు. తన ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ అయిందని పేర్కొన్నాడు. తనను, తన కుటుంబ సభ్యులను బద్నాం చేయడానికి ప్రయత్నం జరిగిందని అన్నారు. ఆ ఫొటోను సైతం సోషల్ మీడియా ఖాతాలో డిలీట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంతలా అంటే.. ఏకంగా తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆయన తండ్రి లాలు తమ పార్టీ ఆర్జేడీ నుంచి 6 ఏళ్లపాటు బహిష్కరించారు.