Madhya Pradesh Duo cut off dead tigresss claws | భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ (Pench Tiger Reserve)లో దారుణ ఘటన జరిగింది. ఓ పులి చనిపోగా, అనుమానం వచ్చి కేసు నమోదు చేసి కొందర్ని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. తమ భార్యలను వశపరుచుకోవడానికి, తాము చెప్పిన మాట వినేలా చేయడానికి క్షుద్రపూజలు, తాంత్రిక పూజలు చేశారు. అందుకోసం పులి చర్మం, దాని పంజా గోళ్లు అవసరమని ఓ మంత్రగాడు చెబితే.. నిజమని నమ్మి ఈ పని చేసినట్లు ఇద్దరు నిందితులు అంగీకరించారు.
అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 26న మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ అడవిలో చనిపోయిన పులి మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే దానిపై క్రూరంగా దాడిచేసినట్లు గమనించారు. పులి చర్మం కొంతభాగం కనిపించలేదు, పైగా ముక్కలుగా నరికి గోళ్లు పీకినట్లు చూసి అధికారులు షాకయ్యారు. ఫోరెన్సిక్ పరీక్షలో పులిది సహజ మరణమే అని తేలింది. కానీ పులి డెడ్ బాడీ చూస్తే అనుమానం కలగడంతో ఐదుగురు వ్యక్తులను అదుపులోకితీసుకున్నారు. వారిని పులి హత్యకు సంబంధించి పదేపదే ప్రశ్నించడంతో నిందితులలో తమ తప్పును అంగీకరించారు. తమ భార్యలను అదుపులో పెట్టుకోవడానికి, వారిని వశపరుచుకోవడానికి క్షుద్రపూజలు, చేతబడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అంగీకరించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పులి గోళ్లకు వైవాహిక సంబంధాలలో మార్పులు తేగల శక్తులున్నాయని స్థానిక మాంత్రికుడు వారికి సలహా ఇచ్చాడు. దాంతో నిందితులు రాజ్ కుమార్, ఝామ్ సింగ్ మంత్రగాడి మాటలు నమ్మి.. పులి గోళ్లతో పూజలు చేస్తే భార్యను లోబరుచుకోవడంతో పాటు వారి పట్ల విధేయత చూపుతారని భావించారు.
పులి హత్యపై స్థానికుడు తెలిపిన వివరాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం అనుమానితులను గుర్తించింది. పులి గోళ్లు, కొన్ని దంతాలు, పులి చర్మంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చేపలు పట్టేటప్పుడు వెళ్లిన సమయంలో ఓ పులి మృతదేహాన్ని చూశారు. పక్కనే మరో పులి ఉండటంతో తిరిగి వెళ్లిపోయారు. మరుసటి రోజు వచ్చి పులి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి పులి దంతాలు, గోళ్లు తీసుకెళ్లారు నిందితులు. కానీ మాంత్రికుడు చర్మం కావాలని చెప్పడంతో మళ్లీ అడవిలోకి వెళ్లి పులి చర్మం కొంత భాగం కత్తిరించి తీసుకెళ్లామని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. గతంలో చిరుతపులి, పులులను వేటాడిన కేసులో వీరు నిందితులుగా ఉన్నారు.ఈ కాలంలోనూ మంత్రాలు, మూఢనమ్మకాలను నమ్మటం ఏంటని అధికారులు ఆశ్చర్యపోయారు. భార్యలను లొంగదీసుకోవడానికి, తమపై నమ్మకం కలిగేలా చేయడానికి పులి చర్మం, గోళ్లు, దంతాలతో పూజలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఒక దర్యాప్తు అధికారి అన్నారు.
ఇద్దరు నిందితులను మే 3వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అటవీ శాఖ కస్టడీకి తరలించారు. ఇందులో ఇంకా ఎవరిపాత్ర ఉంది అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిని పులి చర్మం, భాగాలతో పూజలు చేసి భార్యలను లొంగదీసుకోవచ్చు అని చెప్పిన మంత్రగాడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.