Operation Sindoor | న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందని, ఆపరేషన్​ సిందూర్​తో శత్రు దేశానికి బలమైన సందేశం పంపామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం మన్‌కీ బాత్‌ 122వ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి మోదీ మన్‌కీ బాత్‌లో ప్రసంగించారు. మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ప్రజలంతా దేశభక్తిని చాటుకున్నారని అన్నారు. 

ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని.. మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనం అని ప్రధాని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్‌ సిందూర్‌ కొత్త ఉత్సాహాన్ని నింపింది. మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయి. ఈ ఘటనను అనేక కుటుంబాలు తమ జీవితాల్లో భాగం చేసుకున్నారు. ఆపరేషన్‌ సమయంలో బిహార్​లోని కతిహార్​​, యూపీలోని ఖుషినగర్​తోపాటు అనేక నగరాల్లో జన్మించిన చిన్నారులకు తమ తల్లిదండ్రులు సిందూర్‌ అని నామకరణం చేశారు’ అని పేర్కొన్నారు. 

దేశ ప్రజలను ఎంతో ప్రభావితం చేసిందిఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని ప్రధాని అన్నారు. ఆపరేషన్​ సిందూర్​లో పాల్గొన్న సైనిక దళాలకు మద్దతు తెలుపుతూ అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాలో తిరంగా యాత్రలు నిర్వహించారని, పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజలను ఎంతో ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. 

దేశంలోని టెక్నాలజీ, వస్తువులపై ప్రజలకు మరింత విశ్వాసంసైనికుల ధైర్యాన్ని, వారి నైపుణ్యంతోపాటు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. ‘భారత్​లో తయారైన ఆయుధాలు, పరికరాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో టెర్రరిస్ట్​ బేస్​ క్యాప్​లను మన సైనికులు కూల్చివేశారు. ఇది వారి అజేయ ధైర్యానికి ప్రతీక. దేశంలో రూపొందుతున్న టెక్నాలజీ, వస్తువులపై ప్రజలకు మరింత విశ్వాసం ఏర్పడింది. ఇకపై పిల్లలకు దేశంలో తయారయ్యే ఆట వస్తువులనే కొందాం. చిన్ననాటి నుంచే పిల్లలకు దేశ భక్తిని నేర్పుదాం’

నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందని ప్రధాని అన్నారు.  మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని పేర్కొన్నారు. దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు. నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధించామన్నారు. 

సంగారెడ్డి మహిళలు ‘స్కై వారియర్లు’వ్యవసాయంలో మహిళా రంగం గురించి మోదీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. తెలంగాణలోని సంగారెడ్డి మహిళలు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ఆయన ప్రశంసించారు. ఒకప్పుడు ఇతరుల మీద ఆధారపడే మహిళలు ఇప్పుడు 50 ఎకరాల్లో డ్రోన్ల సాయంతో మందులను పిచికారీ చేస్తున్నారు. వారు ‘డ్రోన్​ ఆపరేటర్లు’ కాదని.. ‘స్కై వారియర్లు’ అని మోదీ అన్నారు. 

సింహాల సంఖ్య పెరగడంపై హర్షంవన్యప్రాణుల సంరక్షణ గురించి కూడా ప్రధాని మాట్లాడారు. దేశంలో సింహాల సంఖ్య పెరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్​లోని గిర్​ అడవుల్లో గత ఐదేళ్లలో సింహాల సంఖ్య 674 నుంచి 891కి పెరిగిందని పేర్కొన్నారు.