conclave of the NDA chief ministers and deputy CMs | న్యూఢిల్లీ: NDA పక్ష ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. అంతకుముందు ఈ నేతలు ప్రధాని మోదీ మన్ కీ బాత్  'Mann Ki Baat' ప్రసంగం విన్నారు. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ముఖ్యంగా భారత సాయుధ దళాలను ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ లో త్రివిధ దళాలు ఏకమై ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేసి తమ ధైర్యసాహసాలు ప్రదర్శించాయని.. ఇది నవ భారతావనికి సూచిక అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి దేశమంతా ఏకమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 

Continues below advertisement


ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ హాజరు


ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన తొలి మన్ కీ బాత్ ఇది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,  సీనియర్ కేబినెట్ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. BJP పాలిత రాష్ట్రాలు, వారి కూటమి భాగస్వాములుగా ఉన్న సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ముందుగానే ఫిక్స్ అయిన కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.


ఎన్డీయే పక్ష సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీలో జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందికి నివాళులు అర్పించారు. పహల్గం ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్‌కు శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ సహా PoKలోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సాయుధ దళాలు మెరుపు వేగంతో దాడి చేసి ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను భారత బలగాలు ప్రదర్శించాయి.


భేటీలో చేసిన తీర్మానాలు ఇవే


ఆపరేషన్ సింధూర్‌తో విజయం సాధించిన సాయుధ దళాలను, ప్రధాని మోదీని అభినందించే తీర్మానాన్ని ఈ భేటీలో ఆమోదించారు. ఈసారి జనాభా లెక్కలలో కుల గణన (Caste Census)ను నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. వికసిత భారత్ @2047 లక్ష్యాన్ని సాధించడంపై ఫోకస్ చేయడం, వ్యూహాత్మక చర్యల ప్రణాళికపై చర్చించడానికి NDA, దాని మిత్రపక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో సమావేశం ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందడానికి భారతదేశానికి మార్గాన్ని అన్వేషించడం.. రాష్ట్రాల అభివృద్ధి ద్వారా - వికసిత రాజ్యం కోసం వికసిత భారత్ సాధ్యమని నేతలు చర్చించారు.


30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా భారత్


భారతదేశం ఆర్థిక, పాలనాపరంగా కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి ప్రపంచ ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదిగేందుకు మరో రెండు దశాబ్దాలు అత్యంత కీలకం కానుందని చర్చించారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని లక్ష్యంగా చేసుకున్న భారతదేశం.. అందుకు రాష్ట్రాలు ఎందుకు కీలకమో ఈ భేటీలో ప్రధాని మోదీ తమ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు వివరించనున్నారు..


దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి కేంద్రంతో కలిసి రావాలని NITI Aayog రాష్ట్రాలను కోరింది. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని, ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా భారత్ రూపాంతరం చెందుతుందని నీతి ఆమోగ్ పేర్కొంది. వికసిత్ భారత్ @2047 లక్ష్యాలను సాధించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ముందున్న సవాళ్లు, పాటించాల్సిన విధానాలపై ఈ భేటీలో కీలకంగా చర్చించారు.


రాష్ట్రాల అద్భుత ప్రగతితోనే వికసిత్ భారత్


ఆర్థిక, సామాజిక, పర్యావరణ రంగాలలో ప్రతి రాష్ట్రం స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలని.. ఇందులో స్థూల రాష్ట్ర అంతర్గత ఉత్పత్తి (GSDP)లో పెరుగుదల కనిపించాలని ప్రధాని మోదీ సూచించారు. ఉద్యోగాల సృష్టి, ఆరోగ్యం, విద్య రంగాలలో మెరుగవడంతో పాటు లింగ సమానత్వం, సహజ వనరుల వినియోగం లాంటి అంశాలపై చర్చించారు. అభివృద్ధి  కోసం కేంద్రం సహకరిస్తుందని, సమర్థవంతంగా పనిచేసి మెరుగైన ఫలితాలు తీసుకురావాలని వారికి ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. స్వచ్ఛ్ భారత్, ఉజ్వల యోజన, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ లాంటి ప్రజల జీవితాలను మార్చిన పథకాలు, విధానాలపై సమీక్షించారు. 


కార్యక్రమాలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అమలు చేయడానికి ప్రత్యేక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు (PMUs), రియల్-టైమ్ వార్ రూమ్‌లు, వాటి నిర్ధారణకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎంలను ప్రధాని మోదీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.