Mumabi Rains:
ముంబయిలో రెడ్ అలెర్ట్..
గత 24 గంటల్లో భారీగా కురిసిన వర్షాలతో ముంబయి జలమయమైంది. ఇవాళ (జులై 27) ఉదయం నుంచి కూడా అక్కడ వానలు దంచికొట్టాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఇప్పటికే IMD అంచనా వేసింది. ఈ మేరకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అలెర్ట్ అయింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. IMD రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించింది.
"ముంబయి పౌరులందరికీ మా విజ్ఞప్తి. దయచేసి ఎవరూ బయటకు రాకండి. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించండి. వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి"
- బీఎమ్‌సీ అధికారులు
భారీ వర్షపాతం..
IMD ముంబయి వెల్లడించిన వివరాల ప్రకారం...కొన్ని చోట్ల 223.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ వద్ద 153.5 మిల్లీ మీటర్లు, రామ్ మందిర్ ప్రాంతంలో 161 మిల్లీ మీటర్లు, బైకుల్లాలో 119 మిల్లీ మీటర్లు, సియోన్‌లో 112 మిల్లీమీటర్లు, బాంద్రా వద్ద 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు IMD వెల్లడించింది. కోలబా ప్రాంతంలో అత్యధికంగా 223.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేవలం ఒక్క రోజు వర్షానికే నగరమంతా తడిసి ముద్దైంది. సముద్రంలోని అలలు ప్రమాదకరంగా ఎగిసిపడుతున్నాయి. ఎప్పటికప్పుడు వీటి ఎత్తు పెరుగుతోంది. ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు పడే అవకాశముందని IMD హెచ్చరించింది. ఇక ఈ వానల కారణంగా చాలా చోట్ల రోడ్లు దెబ్బ తిన్నాయి. ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతోంది. ఇక రైల్వే విషయానికొస్తే...కొన్ని ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
తెలంగాణలోనూ ఇంతే...
ఇటు తెలంగాణలోనూ రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వాన పడుతూనే ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోత వాన జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. ఆదిలాబాద్ మొదలుకొని ఖమ్మం వరకు అదే పరిస్థితి కనిపిస్తోంది. రాత్రంతా వాన ఏకదాటిగా పడుతూనే ఉంది.భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ప్రవాహం చాలా ఉద్ధృతంగా ఉంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో రాత్రి 9.30 గంటలకు భద్రాచలం దగ్గర 48 అడుగులకు చేరింది వరద. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణలో మరో రెండురోజుల పాటు వర్షాలు బీభత్సం సృష్టించనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ముందుగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే వర్షాల కారణంగా వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి.