Kerala CM Pinarai Vijayan: కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను తుపాకీ కాల్చి చంపేస్తానంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాజీ ఎమ్మెల్యే, జనపాషా నేత అయిన పీసీ జార్జ్ భార్య ఉషా జార్జ్. తన భర్తను సీఎం వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. అందుకే సీఎంను హత్య చేయాలని ఉందంటూ మాట్లాడారు. పీసీ జార్జ్‌పైన లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన్ను పోలీసులు గత శనివారమే అరెస్టు చేశారు. పీసీ జార్జ్ అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను హత్య చేయాలంటూ వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆమెపై కేసు నమోదైంది.


అంతకుముందు ఉషా జార్జ్‌ కూడా కాసర్‌గోడ్‌కు చెందిన హైదర్ మధుర్ విద్యానగర్ పోలీస్ స్టేషన్‌లో సీఎంపై ఫిర్యాదు చేశారు. పీసీ జార్జ్ అరెస్ట్ తర్వాత మీడియాతో స్పందించిన ఉషా జార్జ్ ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంత కాలం నేను ఏ పార్టీలో లేను, నాకు నచ్చలేదు. నేను నిజాయతీగా చెప్తున్నా. ఆయనను (ముఖ్యమంత్రి) కాల్చి చంపాలనుకుంటున్నాను. మీరు ఛానెల్ లో ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఇలా కుటుంబాన్ని నాశనం చేసేవాడిని కాల్చి చంపాలి. మా నాన్న రివాల్వర్ ఇక్కడ ఉంది. ఒక వారంలో అతను కాల్పులు ఎదుర్కొంటారు. మొత్తం కుటుంబంపై వేటు వేయడమే ముఖ్యమంత్రి వ్యూహం. నా మాటలు నిజమైతే పినరయి విజయన్ దీనికి బాధ పడతారు. అందరినీ సమానంగా ప్రేమించే వ్యక్తి పీసీ జార్జ్’’ అని ఉషా జార్జా్ స్పందించారు.


కేరళలో జరిగిన సోలార్ కేసులో నిందితుడిగా పీసీ జార్జ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇదంతా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆడిన ఆట అని, అరెస్టు వెనుక రాజకీయ వైరం ఉందని ఉషా జార్జ్ ఆరోపించారు. పీసీ జార్జ్ నిజాయతీపరుడని.. అతడిని తొలుత కేసులో సాక్షిగా పిలిచి, ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ తాము కేసును ఎదుర్కొంటామని, దీని వెనుక ఉన్నవారు, వారి కుటుంబసభ్యులు శాపానికి గురవుతారని అన్నారు.


ఫోర్ట్ అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలోని పోలీసు బృందం శనివారం మధ్యాహ్నం పీసీ జార్జ్‌ను వేధింపుల ఫిర్యాదుపై అరెస్టు చేసింది. సోలార్‌ కేసులో నిందితుల వాంగ్మూలం ఆధారంగా అరెస్టు చేశారు. పీసీ జార్జ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పీసీపై ఐపీసీ 354 కింద పీసీ జార్జ్ పై కేసు నమోదు చేశారు.


కాగా, తనపై జరుగుతున్నది కుట్ర అని పీసీ జార్జ్ ఆరోపించారు. మరో కేసులో అజ్ఞాత వైరం ఈ అరెస్టు వెనుక ఉందని అన్నారు. తనకు ఎలాంటి నష్టం జరగలేదని పీసీ జార్జ్ అన్నారు. అరెస్టు అనంతరం పీసీ జార్జ్‌ను ఏఆర్‌ క్యాంపుకు తరలించారు. అనంతరం ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు.