Rameshwaram Cafe Blast: బెంగళూరు - కర్ణాటకలో సంచలనంగా మారిన బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ లో బాంబు పేలుడుపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ పేలుడుకు ఇద్దరు నిందితులు కారణమని పేర్కొన్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ ఇస్తామని ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున, ఇద్దరు నిందితులకు కలిపి రూ.20 లక్షలు రివార్డ్ ఇస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారిక ఎక్స్ పేజీలో వెల్లడించింది.


మార్చి 1న బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌ లో జరిగిన బాంబు పేలుడులో పలువురు వినియోగదారులు, సిబ్బంది గాయపడ్డారు. ఈ పేలుడు ఘటనలో అబ్దుల్‌ మథీన్‌ అహ్మద్‌, ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌ ప్రధాన నిందితులని ఎన్ఐఏ దర్యాప్తు బృందం వెల్లడించింది. గతంలో 2020లో ఉగ్రదాది కేసులోనూ వీళ్లు వాంటెడ్ జాబితాలో ఉన్నారు. నిందితుల వివరాలు తెలిస్తే info.blr.nia@gov.inకు మెయిల్ చేసి సమాచారం అందించాలని ఎన్ఐఏ కోరింది. నిందితుల సమాచారం తెలిపిన వారి వివరాలపై గోప్యత పాటిస్తామని వెల్లడించింది. గురువారం ఓ నిందితుడు ముజమ్మిల్‌ షరీఫ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతడి వద్ద పేలుడు పదార్థాలను, మరికొన్ని డిజిటల్ పరికరాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.